Friday, May 3, 2024

Cricket: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌.. వైస్‌ కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌

జోహన్స్‌బర్గ్‌: టీమిండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్‌కు వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్‌ వైస్‌ కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌ శర్మ గాయంతో సఫారీలతో జరిగే టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. రోహిత్‌కంటే ముందు వైస్‌ కెప్టెన్‌గా ఉన్న రహానేను అతడి పేలవ ప్రదర్శన కారణంగా తొలగించి ఆ బాధ్యతలు హిట్‌మ్యాన్‌ రోహిత్‌కు అప్పగించారు. కానీ ప్రాక్టీస్‌ సెషన్‌లో రోహిత్‌ గాయపడటంతో ఎన్‌సీఎలో వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నాడు. వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉంటాడని భావిస్తున్నా రోహిత్‌ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఈనేపథ్యంలో కేఎల్‌ రాహుల్‌కు బీసీసీఐ వైస్‌ కెప్టెన్‌ బాధ్యతలు అప్పగించింది. కాగా ఇప్పటివరకు కెరీర్లో 40టెస్టులు ఆడిన రాహుల్‌ 35.16 సగటుతో 2,321 పరుగులు చేశాడు. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా డిసెంబర్‌ 26నుంచి భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య సెంచూరియన్‌లో తొలిటెస్టు ప్రారంభంకానుంది. రోహిత్‌ స్థానంలో ఇటీవల దక్షిణాఫ్రికాలో పర్యటించిన భారత్‌ ఎ కెప్టెన్‌ ప్రియాంక్‌ పాంచల్‌ జట్టులో చేరనున్నాడు. రెండో టెస్టు జనవరి 3నుంచి జోహన్స్‌బర్గ్‌లో జరగనుండగా, మూడో టెస్టు కేప్‌టౌన్‌ వేదికగా జనవరి 11నుంచి ప్రారంభంకానుంది. మూడు టెస్టుల సిరీస్‌ అనంతరం టీమిండియా దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది.

ఫుట్‌వాలీ ఆడిన కోహ్లీసేన
సౌతాఫ్రికాతో మూడు టెస్టులు, మూడు వన్డేల్లో తలపడనున్న భారత్‌ దక్షిణాఫ్రికా చేరుకుని క్వారంటైన్‌ ముగించుకుంది. కరోనా పరీక్షల్లో అందరికి నెగెటివ్‌గా తేలడంతో హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌ ఆధర్యంలో కోహ్లీసేన ప్రాక్టీస్‌లో భాగంగా ఫుట్‌వాలీ ఆడింది. ఫుట్‌బాల్‌-వాలీబాల్‌ కలయికగా క్రికెటర్లు ఫుట్‌వాలీ ఆడుతున్న వీడియోను బీసీసీఐ టిటర్‌లో షేర్‌ చేసింది. ఈ వీడియోలో టీమిండియా క్రికెటర్లు రెండుజట్లుగా విడిపోయి ఆడగా వీరితోపాటు హెడ్‌ కోచ్‌ ద్రవిడ్‌ కూడా పాల్గొన్నాడు. రెండుజట్లులో ఒకదానికి అశ్విన్‌, మరో జట్టుకు ద్రవిడ్‌ కెప్టెన్లుగా వ్యవహరించారు. నేటి ఉదయం నుంచి టీమిండియా క్రికెటర్లు ప్రాక్టీస్‌ సెషన్‌ను ప్రారంభించనున్నారు.

భారత టెస్టు జట్టు: విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, పుజారా, అజింక్య రహానె, ప్రియాంక్‌ పాంచల్‌, శ్రేయస్‌ అయ్యర్‌,హనుమ విహారీ, రిషభ్‌ పంత్‌ (వికెట్‌కీపర్‌), వృద్ధిమాన్‌ సాహా (వికెట్‌ కీపర్‌), ఆర్‌ అశ్విన్‌, జయంత్‌ యాదవ్‌, ఇషాంత్‌శర్మ, షమీ, ఉమేశ్‌ యాదవ్‌, బుమ్రా, శార్దూల్‌ ఠాకూర్‌, సిరాజ్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement