Monday, April 29, 2024

కరోనా వ్యాక్సిన్ ఎవరు తీసుకోవాలి? ఎవరు తీసుకోకూడదు?

కరోనా వైరస్ మహమ్మారి మానవాళికి ముప్పుగా మారింది. దీంతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి ప్రతాపం చూపిస్తోంది. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వ్యాక్సిన్లు వచ్చినా కరోనా ఉధృతి మాత్రం తగ్గడం లేదు. సెకండ్ వేవ్ లో కోవిడ్ వైరస్ మరింతగా రెచ్చిపోతోంది. వేగంగా వ్యాపిస్తూ ప్రాణాంతకంగా మారింది.

కరోనా మహమ్మారి నిర్మూలనకు పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. భారత్‌ సహా పలుదేశాలు ఇప్పటికే పెద్ద సంఖ్యలో టీకాలు వేస్తున్నాయి. జోరుగా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే చాలామంది మొదటి డోసు టీకాలు తీసుకొని రెండో డోసు కోసం ఎదురు చూస్తున్నారు.

కాగా వ్యాక్సినేషన్ వేళ కొన్ని సందేహాలు అందరిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ టీకాలను ఎవరు తీసుకోవాలి? ఎవరు వాయిదా వేసుకోవాలి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీకాలు ఎవరికి ఇస్తారు? ఏ వయస్సులో వాళ్లు తీసుకోవడం క్షేమదాయకం? చిన్న పిల్లలకు ఎందుకు టీకాలు ఇవ్వడం లేదు? లాంటి ప్రశ్నలు చాలా మందిని వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీకాలు వేయడానికి సంబంధించి వైద్య సిబ్బంది చేపట్టాల్సిన చర్యలపై కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.

★ జ్వరంగా ఉన్నప్పుడు మాత్రం కరోనా టీకాను వేయించుకోవద్దు
★ ఎవరికైనా జ్వరం ఉంటే.. పూర్తిగా తగ్గిన తర్వాతనే టీకా తీసుకోవాలి
★ ఒకవేళ అలర్జీ లాంటివేమైనా ఉంటే.. అది తగ్గిన తర్వాతనే టీకా వేసుకోవాలి
★ మొదటి డోస్‌ తర్వాత ఏవైనా ఇబ్బందులు కనిపిస్తే.. రెండో డోసు తీసుకోకూడదు
★ బలహీనమైన వ్యాధినిరోధకత ఉన్నవారు, రోగ నిరోధక శక్తిపై ప్రభావం ఉన్న మందులు వాడేవారు, గర్భిణీలు, అవయవమార్పిడి చేయించుకున్నవారు టీకా తీసుకోకుండా ఉండటం చాలా మంచిది
★ బ్లీడింగ్‌ సమస్యలు ఉన్నవారు డాక్టర్లు లేదా వ్యాక్సిన్‌ పంపిణీ దారులనుంచి అనుమతి తీసుకున్న తర్వాతే టీకా వేసుకోవాలి
★ ప్లాస్మా ఆధారిత చికిత్స తీసుకున్న కొవిడ్‌ రోగులు ఈ టీకాలను వేయించుకోకపోవడం ఉత్తమం.

సాధారణంగా ఏ వ్యాక్సిన్‌కైనా కొన్ని సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండటం సహజం. కరోనా వ్యాక్సిన్‌ విషయంలో కూడా అంతే.. ఒక వేళ సైడ్‌ ఎఫెక్ట్స్‌(తలనొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు) కనిపిస్తే.. వెంటనే డాక్టర్‌ను సంప్రదించి తగు సలహాలు తీసుకోవాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement