Monday, April 29, 2024

దేశవ్యాప్తంగా కేసులు తగ్గాయి.. సవాళ్లు పెరిగాయి: మోదీ

దేశంలో యాక్టివ్ కేసులు కొద్దికాలంగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు.  అయితే, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చూసినప్పుడు, ఇన్‌ ఫెక్షన్ అనేది ఏ కొద్దిగా మిగిలినా మన ముందున్న సవాలు పూర్తిగా తొలగనట్టేనని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. దేశంలో కోవిడ్ మేనేజిమెంట్‌ పై క్షేత్ర స్థాయిలో జిల్లాల్లో పనిచేస్తున్న అధికారులతో ప్రధాని మోదీ రెండో విడత గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. కరోనా కారణంగా అందరిపై మరింత బాధ్యత, సవాళ్లు పెరిగాయని  మోదీ చెప్పారు. ఈ సరికొత్త సవాళ్ల మధ్య మనం కొత్త వ్యూహాలు, పరిష్కారాలతో ముందుకు వెళ్లాల్సి ఉంటుందని దిశానిర్దేశం చేశారు. స్థానిక అనుభవాలను సమర్ధవంతంగా ఉపయోగించుకుంటూ అంతా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.

కాగా, భార‌త్‌లో గడచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 2,76,070 మందికి కరోనా నిర్ధారణ అయింది. నిన్న 3,69,077  మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,57,72,400కు చేరింది. మరో 3,874 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 2,87,122 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,23,55,440 మంది కోలుకున్నారు. 31,29,878 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 18,70,09,792 మందికి వ్యాక్సిన్లు వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement