Thursday, April 25, 2024

కాంగ్రెస్ లో ఎవరికి వారే లీడర్లు

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీ వద్ద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణ కాంగ్రెస్ లో ఎవరికి వారే లీడర్.. ఒక లీడర్ మరో లీడర్ ను గెలిపించాలా?’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి గట్టి నాయకత్వం ఉందన్నారు. అయితే, పార్టీలో లీడర్లు ఉన్నా.. సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవడం లేదన్నారు. నల్గొండ, నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో జానారెడ్డిపై ప్రజలకు సానుభూతి ఉందని తెలిపారు. సాగర్ లో టీఆరెస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందన్నారు. జానారెడ్డి 30 ఏళ్ల నుంచి రాజకీయాలు చేస్తున్నారని, ఆయనకు ఇంకొకరి ప్రచారం అవసరమా? అని ప్రశ్నించారు. నాగార్జున సాగర్ లో ప్రతి ఊరిలో గుర్తుపట్టని వాళ్ళు ఉండరని చెప్పారు. జానారెడ్డి చేసిన పనులు, అభివృద్ధి, సానుభూతి ఆయన్ను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు వాణిదేవి, పల్లారాజేశ్వర్ ఎలా గెలిచారో అందరికి తెలుసున్నారు రాజగోపాల్. రెండు ఎమ్మెల్సీలు టీఆరెస్ గెలిచింది అని ఎవ్వరూ అనుకోవడం లేదన్నారు. డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కొని గెలిచి సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించారు. టీఆరెస్ పార్టీ రాజకీయాలను బ్రష్టపట్టిస్తోందన్నారు. ఇలాంటి రాజకీయాలు చూస్తామని అనుకోలేదన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి మాట్లాడిన మాటలు వందశాతం కరెక్ట్ అని రాజగోపాల్ అభిప్రాయపడ్డారు. రెండు ఎమ్మెల్సీలు గెలిచినంత మాత్రాన టీఆరెస్ నిజమైన గెలుపు కాదన్నారు. కోదండరాం, తీన్మార్ మల్లన్న, రామచందర్ రావులు ఓడి గెలిచారని.. టీఆరెస్ గెలిచి ప్రజల్లో ఓడిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు- పొన్నాల లక్ష్మయ్య పీసీసీ- కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయినట్లు ఎవరైనా ఏమైనా కావొచ్చు అని వ్యాఖ్యానించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement