Monday, April 29, 2024

మరియమ్మ కుటుంబానికి న్యాయం.. కాంగ్రెస్ డిమాండ్ సీఎం హామీ

తెలంగాణలో సంచలనం రేపిన మరియమ్మ అనే మహిళ లాకప్ డెత్‌ అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ ను కలిశారు. హైదరాబాదులోని ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. మరియమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశం అనంతరం భట్టి విక్రమార్క ప్రగతి భవన్‌ వద్దే మీడియాతో మాట్లాడారు. మరియమ్మ అనే ఎస్సీ మహిళ లాకప్ లో దారుణంగా చనిపోయిన విషయాన్ని సీఎం కేసీఆర్ కు వివరించామని తెలిపారు. లాకప్ డెత్ కు కారణమైన వారిపై చర్యలు ఉంటాయని సీఎం హామీ ఇచ్చారని చెప్పారు. ఈ కేసు విచారణను వేగవంతం చేయాలని డీజీపీకి ఆదేశాలు ఇచ్చారని వెల్లడించారు.

మరియమ్మ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారని భట్టి తెలిపారు. అంతేకాక, మరియమ్మ కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తామని కూడా కేసీఆర్ అన్నారని చెప్పారు. మరియమ్మ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరగా, సీఎం సానుకూలంగా స్పందించారని భట్టి పేర్కొన్నారు. మరియమ్మ కుమారుడు ఉదయ్ కిరణ్ కు ప్రభుత్వ ఉద్యోగం, రూ.15 లక్షల ఎక్స్ గ్రేషియా, నివాస గృహం, ఇద్దరు కుమార్తెలకు చెరో రూ.10 లక్షల ఆర్థికసాయం అందించేందుకు సీఎం అంగీకరించారని భట్టి వివరించారు.

కాగా, ఇటీవల యాదాద్రి జిల్లా అడ్డగూడూరులో మరియమ్మ అనే ఎస్సీ మహిళను చోరీ కేసులో పోలీసులు అరెస్ట్ చేయగా, ఆమె లాకప్ లో చనిపోవడం తీవ్ర సంచలనమైంది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రాచకొండ సీపీ మహేశ్ భగవత్… అడ్డగూడూరు ఎస్సె మహేశ్ తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.

https://twitter.com/OffDSB/status/1408421818080186368
Advertisement

తాజా వార్తలు

Advertisement