Sunday, May 5, 2024

అక్క‌డా… ఇక్క‌డా వ‌చ్చేది మేమే – ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే

మంచిర్యాల, ప్రభన్యూస్‌ ప్రతినిధి: దేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నియంతలుగా వ్యవహరిస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే విమర్శించారు. వంద ఫీట్ల ఎత్తు విగ్రహాలు పెట్టడం కాదు.. పేద వర్గాలకు ఏమి చేశారో చెప్పాలని సీఎం కేసీఆర్‌నుద్దేశించి ఖర్గే ప్రశ్నించారు. మూడు ఎకరాల భూమి, డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇస్తామన్న హామీని ఎందుకు అమలు చేయలేదని ఆయన నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో, తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వరంగ సంస్థ లన్ని ప్రయివేట్‌పరం చేస్తున్నారని, ఇక మిగిలింది గాలి ఒక్క టేనని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 75ఏళ్లలో ఏమి చేయకపోతే మోడీ ప్రధానమంత్రి అయ్యేవారా… ఖర్గే ప్రశ్నించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్రలో భాగంగా శుక్రవారం మంచిర్యాలలో నిర్వహించిన ‘జై భారత్‌ సత్యాగ్రహ’ దీక్షలో మల్లిఖార్జున ఖర్గే మాట్లాడారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాజ్యాంగం రచించి దేశానికి దిశను చూపించారని, దళితులు, పేదలు, ధనవంతులందరికి సమానంగా ఓటు హక్కు కల్పించారని, అణగారిన వర్గాలకు ఓటు అనే ఆయుధం ఇచ్చా రని ఆయన తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వాలు అంబేద్కర్‌ను మర్చిపోతున్నాయన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సబ్‌ప్లాన్‌ నిధులు ఖర్చు చేయడమే కాకుండా జనాభా దామాషా ప్రకారం కాంగ్రెస్‌ ప్రభుత్వం నిధులు ఖర్చు చేసిందని తెలిపారు.



దేశ స్వాతంత్య్రం కోసం నెహ్రూ, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ పోరాటం సాగించార న్నారు. ప్రభుత్వ పరిశ్రమలను అమ్మడం వల్ల రిజర్వేషన్లు ఉండకపో వడమే కాకుండా ఉద్యోగాలు కూడా దక్కవన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్న నరేంద్రమోడీ.. ఈ తొమ్మిదేళ్లలో ఎన్ని ఉద్యోగాలిచ్చారో చెప్పాలని ఖర్గే డిమాండ్‌ చేశారు. దేశంలో 30లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఎందుకు భర్తీ చేయడం లేదన్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పార్లమెంట్‌ సభ్య త్యాన్ని అన్యాయంగా అనర్హత వేటు వేశారని ఆయన మండి పడ్డారు. ఇప్పుడు ఇంటిని ఖాళీ చేయించారన్నారు. అదే బీజేపీకి చెందిన ఒక ఎంపీ హత్యానేరంలో శిక్ష పడితే ఎందుకు అనర్హత వేటు వేయలేదని, ప్రశ్నించారు. అనర్హత వేటుకు భయపడేది లేదని, దేశంలో సమానత్వం లేదని ఆయన విమ ర్శించారు. తాను 12 ఎన్నికల్లో పోటీ చేస్తే 11సార్లు గెలిచానని, ఎమ్మెల్యే, ఎంపీ, రాజ్యసభ సభ్యుడిగా కాంగ్రెస్‌ పార్టీ అవకాశం ఇచ్చిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుందని, నాలాంటి పేదవాడు బ్లాక్‌ స్థాయి నుంచి ఏఐసీసీ అధ్యక్ష పదవి వరకు రావడం కాంగ్రెస్‌లోనే సాధ్యమన్నారు.

17 వందల మందికి దళిత బంధు ఇస్తే సరిపోతుందా?: ఉత్తమ్‌
రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగురవేసేందుకు భట్టి విక్రమార్క మండుటెండల్లో పాదయాత్ర చేసతున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షులుగా ఉన్న మల్లిఖార్జున ఖర్గే మంచిర్యాలకు రావడం అదృష్టమన్నారు. 9 ఏళ్లుగా దళిత వర్గాలను కేసీఆర్‌ అన్యాయం చేశారని, మొదటి సీఎంను దళితుడిని చేస్తానని, చేయకపోతే తలనరుక్కుంటా అని మోసం చేశారని మండిపడ్డారు. దళిత బంధు నినాదంతో మోసం చేస్తున్నారని, 17 లక్షల మంది దళితులు ఉంటే 17 వందల మందికి ఇస్తే సరిపోతుందా..? అని ఆయన మండిపడ్డా రు. మంత్రి వర్గంలో సామాజిక న్యాయం ఎందుకు లేదని ప్రశ్నించారు. సింగరేణిపై 5 లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయన్నారు. ఒక్క బొగ్గు గని ప్రయివేటీకరణ చేయనీయమని ఆయన హామీ ఇచ్చారు.

అక్కడా… ఇక్కడా అధికారంలోకి వస్తాం: పలువురు కాంగ్రెస్‌ నేతలు
మాది కాంగ్రెస్‌ బలగమని, అందరం కలిసి పని చేసి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు అన్నారు. ఒకరిద్దరు నాయకులు పార్టీని విడిచి వెళ్లినా నష్టం లేదని, కాంగ్రెస్‌కు లక్షలాది మంది కార్యక ర్తలు ఉన్నరాని, అందులో నుంచే నాయకులు పుట్టుకొస్తారని వీహెచ్‌ ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామో దర రాజనరసింహ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తెద్దామని పార్టీ శ్రేణులకు పిలుపుని చ్చారు. దేశానికి ఏదైనా మంచి చేసే పార్టీ ఉందంటే అది కాంగ్రెస్‌ పార్టీనేనని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు మనుధర్మ పార్టీలని మండిపడ్డారు. పెద్ద పెద్ద విగ్రహాలు, భవంతులు కడితే ప్రజా స్వామ్యం కాదని ఆమె హితవు పలికారు. మాజీ ఎంపీ మధు యాష్కీగౌడ్‌ మాట్లాడుతూ దళిత వర్గానికి చెందిన భట్టి విక్ర మార్క శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉంటే కేసీఆర్‌ ఓర్చు కోలేదని, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకుని ప్రతి పక్ష హోదా లేకుండా చేశారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీలోనే దళితులకు న్యాయం జరిగిందని, పార్టీ పదవుల్లో కూడా పెద్దపీఠ వేస్తుందన్నారు. మల్లిఖార్జున ఖర్గేను ఏఐసీసీ అధ్యక్షుడిగా పార్టీ అవకాశం కల్పించిందని ఆయన తెలిపారు. బీజేపీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి విధ్వంసం సృష్టి స్తోందని ఏఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు విమర్శిం చారు. తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో సీఎం కేసీఆర్‌ దళిత వర్గాలక చేసిందేమిటో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే ఈ ప్రాంతానికి న్యాయం జరగు తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. సింగ రేణిని ప్రయివేటుకు అప్పగించేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు మాట్లాడు తూ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులందరు కలిసికట్టుగా ఉండాలని 80 నుంచి 90 సీట్లు గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ మాట్లాడుతూ ఏనాడు అంబేద్కర్‌ జయంతులు, వర్థంతులు గుర్తుకురాని కేసీఆర్‌కు.. ఇప్పుడెలా ప్రేమ పుట్టుకొచ్చిందని ప్రశ్నించారు. వచ్చే ఎన్నిక ల్లో దళితులను మరోసారి మోసం చేసి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని, ఇప్పుడవి సాగవని ఆయన పేర్కొన్నారు.


ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది: మల్లు భట్టివిక్రమార్క
ఈ రోజు భారతదేశానికి అత్యంత పవిత్ర మైన రోజని, డాక్టర్‌ బిఆర్‌ అంబేడ్కర్‌ పుట్టిన రోజున ఇక్కడ సభ జరుపుకోవడం చరిత్రాత్మక మవుతుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతుంటే ఎఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సారథ్యంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం జైభారత్‌ సత్యాగ్రహ సభలను నిర్వహించుకుం టున్నామని తెలిపారు. ఈ సత్యాగ్రహాల వల్ల తెచ్చుకున్న స్వాతంత్య్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కాంగ్రెస్‌ పార్టీ వల్లే సాధ్యమవుతుందని చెప్పారు. మంచిర్యాలలో జరుగుతున్న ఈ సభ దేశానికి దిశ, నిర్దేశం చేస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర సందేశాన్ని ఊరూరా తీసుకుపోవాలన్న లక్ష్యంతో ఈ పాదయాత్ర చేపట్టడం జరిగిందని భట్టివిక్ర మార్క తెలిపారు. పాదయాత్రలో తాను అనేక విషయాలను నేర్చుకుంటున్నానని, ప్రజల కష్టాలు, కడగండ్లు తెలుస్తున్నా యని, తనను ఒక వ్యక్తిగా ఈ యాత్ర తీర్చిదిద్దుతోందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారం లోకి రాబోతోందని, ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టును చేపడతా మని, గిరిజనులకు పోడుభూములకు పట్టాలు ఇస్తామని, అసైన్డ్‌ భూములను తిరిగి ఇస్తామని భట్టి ప్రకటించారు. సింగరేణి ఉద్యోగాలు స్థానికులకే ఇస్తామని హామీ ఇచ్చారు. సింగరేణిని ప్రైవేట్‌ పరం చేస్తామంటే సహించే ప్రసక్తిలేదని హెచ్చరించారు.
తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని భరోసాఇచ్చారు. సీఎం కేసీఆర్‌ హయాంలో అదిలాబాద్‌జిల్లాకు అన్నివిధాలుగా అన్యాయం జరిగిందని, కాళేశ్వరంతో అదిలాబాద్‌ను ముంచే శారని, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను దించాలని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారం లోకి రాగానే ప్రాణహిత -చేవెళ్లను చేపట్టి అదిలాబాద్‌ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సింగరేణిని ప్రైవేట్‌ పరం చేస్తామంటే సహించే ప్రసక్తిలేదని, కాంగ్రెస్‌ పార్టీ అడ్డుకుంటుందని చెప్పారు.


భట్టి యాత్రతో వైఎస్‌ పాదయాత్ర గుర్తుకు వస్తోంది: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ఆనాడు దివంగ త వైఎస్‌ రాజశేఖరరెడ్డితో కలిసి తాను, మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర చేశామని, ప్రస్తుతం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర వైఎస్‌ ను గుర్తుకు తెస్తోందని ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్‌ సామాజిక న్యాయాన్ని పక్కనబెట్టి 125 అడు గుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని పెట్టడం సరికాదన్నారు. దళితుల జనాభా 20 శాతం కాగా, జనాభా దామాషా ప్రకారం ఈ వర్గా లకు చెందిన మంత్రులు లేరని, కేవలం ఒక్కరినే మంత్రిగా నియమించారని, మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి మంత్రివర్గంలో స్థానమే లేదని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement