Monday, July 15, 2024

రహదారులంతా వడ్లమయం.. ధాన్యం దళారుల పాలు !

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వరి పంట చేతికి అందింది. రెండు రోజులుగా వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో ఎప్పుడు ఏమవుతుందోనని రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. వరి నూర్పిడి పూర్తిచేసుకుని ఆరబెట్టుకుని అమ్ముకుందామంటే ఎప్పుడు వర్షం వచ్చి పడుతుందో దాన్ని తడిసి ముద్దవుతుందోనని రైతులను ఆందోళనకు గురిచేస్తుంది. గత 20 రోజుల నుండి నిజాంబాద్ జిల్లాలో వరి కోతలు ఆరంభమయ్యాయి. ప్రభుత్వం నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో సుమారు 450 దాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. చేతి అందిన ధాన్యాన్ని వ్యవసాయ క్షేత్రాల్లో ఆరబెట్టుకుందామంటే వర్షం ముంచెత్తితే ధాన్యం తడిసి ముద్దవడంతో పాటు వ్యవసాయ భూములు నీరు చేరి బురద మ‌యంగా మారి ధాన్యం మొలకెత్తే పరిస్థితులు ఎదురవుతాయి. ఎటు దిక్కుతోచని పరిస్థితిలో చేతికి అందిన ధాన్యాన్ని రహదారుల వెంట ఆరబోసుకోక తప్పడం లేదు. శుక్రవారం ఉదయం నుండి వాతావరణంలో పెను మార్పులు చేసుకున్నాయి. రాత్రంతా ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన చినుకులు రాలాయి. రోడ్ల వెంట ధాన్యం తడిసి ముద్ద‌వ‌డంతోపాటు రంగు మారడం నాణ్యత తగ్గడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటే తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తుందని రైతులు రాత్రంతా కంటిమీద కునుకు లేకుండా వడ్లను కాపాడుకునేందుకు కుటుంబాల సమేతంగా రాత్రంతా వడ్ల కుప్పలను కాపాడుకునే ప్రయత్నాలు చేశారు. వరుణదేవుడు కన్నెర్ర చేయకపోవడం రైతులు ఊపిరి పీల్చుకున్నారు. శనివారం ఉదయం నుండి ఆకాశం మేఘావృతం కావడంతో వడ్లు ఆరబెట్టాల వ‌ద్దా అనే సందోహం నెల‌కొంది. మ‌ళ్లీ ధాన్యం త‌డిస్తే రంగు మారుతుంది. రోడ్లపై ఉన్న ధాన్యపు రాశులను పగలగొట్టి రోడ్డు ఇరువైపులా పట్టాలపై ఆరబోసుకోవడం రైతులకు తప్పడం లేదు. రోడ్లపై ధాన్యం ఆరబోస్తే రోడ్డు ప్రమాదాలు ఎదురవుతున్నాయని అధికారులు ధాన్యాన్ని రోడ్లపై ఆరబోయొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆ ఆరుగాలం కష్టపడి తమ రక్తాన్ని చెమటగా మార్చి రైతులు పంటలను పండిస్తున్నారు. రైతుల కష్టాన్ని గుర్తు ఎరిగి అధికారులు వ్యవసాయదారులకు మినహాయింపు ఇవ్వాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు నేటికీ ప్రారంభించకపోవడంతో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

వరి ధాన్యం దళారుల పాలు
రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను దళారులు ఆసరాగా చేసుకుని ఆయిన కాడికి ధాన్యం కొనుగోలు చేసి దండుకుంటున్నారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి 2060 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యానికి 2040 మద్దతు ధర ప్రకటించినప్పటికీ మద్దతు ధర రైతుల దరి చేరడం లేదు. ఇతర రాష్ట్రాల ఇతర జిల్లాల మిల్లర్లు స్థానిక దళారులను అడ్డుపెట్టుకొని పచ్చి ధాన్యాన్ని దోపిడీ చేస్తున్నారు. ధాన్యాన్ని రూ.1650 నుండి రూ.1700 కు కొనుగోలు చేసి రైతులను నిలువు దోపిడీ గురి చేస్తున్నారు. ధర తక్కువ చెల్లించడం కాకుండా క్వింటాలకు ఐదు కిలోలు తరుగు పేరిట దండుకుంటున్నారు. ఇప్పటికైనా రైతుల కష్టాలను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి రైతుల కష్టాలను సంబంధిత అధికారులు గట్టెక్కించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వర్షం ఎప్పుడు వచ్చి పడుతుందోనని ఆందోళనలో రైతులు దళారులను ఆశ్రయించి ధాన్యాన్ని పెద్ద ఎత్తున అమ్ముకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement