Friday, May 3, 2024

Exclusive | కావేరి జలాలపై కయ్యం.. బోర్డు ముందు వాదించుకున్న తమిళనాడు, కర్నాటక!

కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య వాటర్​ వార్​ ముదురుతోంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా కావేరీ నదిలో నీళ్లు లేవు. దీంతో కర్నాట రైతులకు సాగునీరు ఇబ్బందిగా మారుతోంది. అయితే.. తమిళనాడుకు ప్రధాన తాగునీటి వనరుగా ఉన్నది ఒక్క కావేరీ జలాలు మాత్రమే.. దీంతో తమకు రోజూ 24వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని తమిళనాడు కావేరీ జలాల నియంత్రణ కమిటీని ఆశ్రయించింది. ఈ క్రమంలో ఇవ్వాల ఇరు రాష్ట్రాల వాదనలు విన్న కమిటీ.. రేపు జలాల విడుదలపై నిర్ణయం తీసుకోనుంది.

– వెబ్​ డెస్క్​, ఆంధ్రప్రభ

తమిళనాడు రాష్ట్రానికి రానున్న 15 రోజుల పాటు రోజుకు 5,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కావేరీ జలాల నియంత్రణ కమిటీ (సీడబ్ల్యూఆర్‌సీ) కర్నాటక రాష్ట్రాన్ని ఆదేశించింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా పొరుగు రాష్ట్రానికి నీటిని విడుదల చేయలేకపోవడంపై కర్నాటక తొలుత అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఇరు రాష్ట్రాల అభ్యర్థన మేరకు సీడబ్ల్యూఆర్​సీ ఇవ్వాల (సోమవారం) ఈ నిర్ణయం తీసుకుంది.

కాగా, లోటు వర్షపాతం, తమిళనాడుకు నీటి విడుదల కారణంగా కావేరీ బేసిన్‌లో నీటి నిల్వ తగ్గుతోందని.. ఈ కారణంగా నీటి విడుదలను నిలిపివేయాలని కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు. అయితే.. సీడబ్ల్యూసీఆర్​సీ తీసుకున్న నిర్ణయం కర్నాటక రైతులకు కోపం తెప్పిస్తోంది. దీనిపై చర్చించేందుకు సోమవారం ఢిల్లీలో సీడబ్ల్యూఆర్‌సీ భేటీ జరిగింది. ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం బిలింగుండ్లు నీటి కొలిచే స్టేషన్‌లో నమోదైందని పేర్కొంటూ వచ్చే 15 రోజులపాటు తమిళనాడుకు 5వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కర్నాటకను సీడబ్ల్యూసీఆర్​ ఆదేశించింది.

- Advertisement -

ఇక.. ఈ సమావేశంలో వాదనలు వినిపించిన తమిళనాడు.. వచ్చే 10 రోజుల పాటు రోజుకు 24,000 క్యూసెక్కుల నీటిని డిమాండ్ చేసింది. అయితే దీన్ని CWRC తిరస్కరించింది. తమిళనాడుకు 7,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కర్నాటకకు సూచించగా, ఆ ప్రతిపాదనపై కర్నాటక అభ్యంతరం వ్యక్తం చేసింది. చాలా తర్జనభర్జనల అనంతరం వచ్చే 15 రోజుల పాటు తమిళనాడుకు రోజుకు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కమిటీ ఆదేశించింది. అయితే మంగళవారం ఢిల్లీలో జరిగే కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (సీడబ్ల్యూఎంఏ)లో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

సీడబ్ల్యూఆర్‌సీ ఆదేశాల మేరకు కర్నాటక ఇప్పటివరకు తమిళనాడుకు ప్రతిరోజూ 10 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తోంది. మరోవైపు జలవనరుల శాఖ మాజీ మంత్రి, బీజేపీ నేత గోవింద్ కార్జోల్ సీడబ్ల్యూఆర్‌సీ ఆదేశాలను ప్రభుత్వం పాటించరాదని డిమాండ్ చేశారు.  “రిజర్వాయర్‌లో నీటి కొరత కారణంగా మా రైతులకు సరిపోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ రాష్ట్రం తమిళనాడుకు నీటిని విడుదల చేయకూడదు. మా రిజర్వాయర్లలో నీరు లేదని, ఈ ఏడాది నీటిని ఇకపై విడుదల చేయలేమని ప్రభుత్వం CWMA ముందు వాదించాలి ”అని కార్జోల్ అన్నారు. కాగా, నీటిని విడుదల చేసేలా కర్నాటకను ఆదేశించాలని కోరుతూ తమిళనాడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సెప్టెంబరు 8లోగా విడుదల చేసిన నీటి పరిమాణంపై నివేదిక సమర్పించాలని సీడబ్ల్యూఎంఏను సుప్రీంకోర్టు ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement