Friday, May 17, 2024

ఆఫీసులకు వచ్చేయండి.. ఉద్యోగులకు ఐటీ కంపెనీల నుంచి పిలుపు..

కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.. ఆర్థిక వ్యవస్థ పట్టాలెక్కుతున్నది.. స్కూళ్లు, కాలేజీలు తెరుచుకున్నాయి.. ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా పనులు స్పీడ‌ప్ అవుతున్నాయి.. రైళ్లు ఆగడం లేదు.. విమానాలు ఎగురుతూనే ఉన్నాయి.. ఇక ఇంటికాన్నుంచి ప‌నిచేసింది చాలు.. ఆఫీసులు రావాలి అని ఐటీ కంపెనీలు త‌మ ఉద్యోగుల‌ను పిలుస్తున్నాయి. దేశ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఐటీ రంగ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. రెండేళ్ల నుంచి వర్క్‌ ఫ్రం హోం చేస్తున్న తమ ఉద్యోగులను తిరిగి వర్క్‌ ఫ్రం ఆఫీస్‌కు సిద్ధం చేస్తున్నాయి.

ఇంటి నుంచి చేసిన పని చాలని.. ఇక ఆఫీసుకు వచ్చి కరోనా ముందు తరహాలో విధులు నిర్వహించాల్సి ఉంటుందని ప్రముఖ టెక్‌ కంపెనీలు టీసీఎస్‌, విప్రో, కాగ్నిజెంట్‌తో పాటు ఇన్ఫోసిస్‌ ప్రకటించాయి. మార్చి నుంచి ఆఫీసుకు వచ్చేందుకు అన్ని విధాలుగా సిద్ధం కావాలని ఆదేశాలు జారీ చేశాయి. కరోనా మహమ్మారి భారత్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఐటీ కంపెనీల్లోని ఉద్యోగులందరూ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు ఇళ్లకు తీసుకెళ్లి.. వర్క్‌ ఫ్రం హోం చేస్తూ వచ్చారు. సుమారు రెండేళ్ల నుంచి వీరంతా ఇంటి నుంచే పనులు చక్కబెడుతున్నారు. కరోనా కారణంగా చాలా కంపెనీలు ఫ్లెక్సిబుల్‌ హైబ్రిడ్‌ వర్క్‌ మోడల్‌ను అనుసరించాలని యోచిస్తున్నప్పటికీ.. ఐటీ ఉద్యోగుల పని విషయంలో తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది. కొన్ని కంపెనీలు ఫ్లెక్సిబుల్‌ హైబ్రిడ్‌ వర్క్‌ మోడల్‌ అమలు చేశాయి. సత్ఫలితాలు రాలేవు. దీంతో చివరికి ఆఫీసు నుంచి పనులు చక్కబెడితే తప్ప గట్టెక్కలేమని భావించాయి. దీంతో వర్క్‌ ఫ్రం హోంకు తెరపడుతున్నది. బెంగళూరు కేంద్రంగా ఐటీ కంపెనీ విప్రో మేనేజర్‌ స్థాయి అంతకంటే ఎక్కువ మందిని మార్చి 3లోపు తిరిగి కార్యాలయాలకు రావాలని కోరింది. అయితే ప్రస్తుతానికి విప్రో పై స్థాయి ఉద్యోగులను వారానికి రెండు రోజుల మాత్రమే పిలవనుంది. కాగ్నిజెంట్‌ కంపెనీ మాత్రం.. తమ కార్యాలయాలను స్వచ్ఛందంగా తిరిగి తెరిచేందుకు నిర్ణయించింది. ఏప్రిల్‌ నాటికి ఉద్యోగులందరూ.. ఆఫీసు నుంచి పని చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.

3-4 నెలల్లో పూర్తి స్థాయిలో..

ఇన్ఫోసిస్‌ విషయానికొస్తే.. 2022 నాటికి హైబ్రిడ్‌ వర్క్‌ మోడల్‌ను కొనసాగించాలని భావిస్తున్నప్పటికీ.. రాబోయే 3-4 నెలల్లోనే ఎక్కువ మంది ఉద్యోగులను ఆఫీసులకు రప్పించేందుకు నిర్ణయించినట్టు తెలుస్తున్నది. విప్రో కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ.. మార్చి 3 నుంచి మేనేజర్‌ అంతకంటే ఎక్కువ స్థాయి ఉద్యోగులు, రెండు డోసులు వ్యాక్సిన్‌ తీసుకున్న వాళ్లు.. వారానికి రెండు సార్లు సోమవారం, గురువారాలు ఆఫీసు నుంచి పని చేయించేందుకు ఆలోచిస్తున్నాం. ఇతర ఉద్యోగులను ఇంటి నుంచి పని కొనసాగించేందుకు నిర్ణయిస్తున్నాం. మార్చి నుంచి ఉద్యోగులను కార్యాలయాలకు పిలిపిస్తున్నామని, అందుకు మీరూ సిద్ధంగా ఉండాలని టీసీఎస్‌, విప్రో, కాగ్నిజెంట్‌, ఇన్ఫోసిస్‌ కంపెనీల ప్రతినిధులు ఉద్యోగులకు పెట్టిన మెయిల్స్‌లో పేర్కొన్నాయి.

రిమోట్‌ వర్కింగ్‌ పాలసీ

- Advertisement -

టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ హైబ్రిడ్‌ వర్క్‌ మోడల్‌ ట్రెండ్‌లో చేరాయి. ఇన్ఫోసిస్‌ రాబోయే 3-4 నెలల్లో మెజార్టీ ఉద్యోగులను కార్యాలయాలకు పిలిపించుకోవాలని యోచిస్తున్నది. టీసీఎస్‌.. వర్క్‌ ఫ్రం హోం ఎంచుకున్నప్పటికీ.. బేస్‌ లొకేషన్‌ నుంచి పని చేసే రిమోట్‌ వర్కింగ్‌ పాలసీని తీసుకొచ్చింది. టీసీఎస్‌.. తమ అసోసియేట్‌లకు పంపిన మెయిల్స్‌ ప్రకారం.. రిమోట్‌ వర్కింగ్‌ కొనసాగుతుందని ఆశించినప్పటికీ.. తమ సిబ్బంది తమ డిప్యూట్‌ స్థానాల్లో ఇంటి నుంచి పని చేయాలని ఆశిస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ అసోసియేట్‌లలో చాలా మందికి టీకాలు వేయడం, మొత్తం కరోనా పరిస్థితి మెరుగుపడటంతో.. చాలా మంది ఉద్యోగులు టీసీఎస్‌ కార్యాలయాల నుంచే పని చేస్తున్నారని కంపెనీ తెలిపింది. కొన్ని చోట్ల టీసీఎస్‌ కార్యాలయాలు తెరుచుకున్నాయి. ఉద్యోగులు ఆఫీస్‌ నుంచే పనులు చక్కబెడుతున్నారు. 96 శాతం మంది ఉద్యోగులు ఇప్పటికే రిమోట్‌లో పని చేస్తున్నారు. కంపెనీ తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే.. ముందుకు వెళ్తున్నది.

సిబ్బందికి తగిన భద్రతా ఏర్పాట్లు

ఇన్ఫోసిస్‌ హెచ్‌ఆర్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రిచర్డ్‌ లోబో మాట్లాడుతూ.. స్థిరమైన స్థితిలో.. కరోనా పరిస్థితులకు లోబడి.. తాము హైబ్రిడ్‌ వర్క్‌ మోడల్‌ను ఆశిస్తున్నామన్నారు. దీనిలో దాదాపు 40-50 శాతం మంది ఉద్యోగులు ఆఫీస్‌ పోస్టు నుంచి కార్యాలయానికి తిరిగి వచ్చే తదుపరి దశల నుంచి పని చేసే అవకాశం ఉందన్నారు. ఏప్రిల్‌ నుంచి పూర్తి స్థాయిలో ఉద్యోగులను పిలిపించేందుకు కాగ్నిజెంట్‌ నిర్ణయించింది. కంపెనీ హెచ్‌ఆర్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శాంతను ఝూ మాట్లాడుతూ.. ఒమిక్రాన్‌ వేరియంట్‌ పరిస్థితిని గమనిస్తున్నాం. ఏప్రిల్‌ నుంచి దశల వారీగా కార్యాలయం నుంచే పని చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ప్రయాణాలపై ఆంక్షలు విధించాం. ఆఫీసు నుంచి పని స్వచ్ఛందంగా ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement