Monday, May 6, 2024

Weather Alert: తెలంగాణలో మరో మూడ్రోజులు చలిగాలులు

తెలంగాణలో చలి తీవ్రత మళ్లీ పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా పడిపోయిన ఉష్ణోగ్రతలతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. సంక్రాంతి పండుగ దాటాక కాస్త తగ్గుముఖం పట్టిన శీతల గాలులు ఇప్పుడు మళ్లీ వీస్తున్నాయి. అన్ని ప్రాంతాల్లో సాధారణ సగటు కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

తూర్పు, ఆగ్నేయ ప్రాంతాల నుంచి చలి గాలులు వీస్తుండటంతో రాష్ట్రంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది.  మరో రెండు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. చలి విజృంభణ కారణంగా ప్రజలు ఇబ్బందుల పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 6 డిగ్రీల సెల్సియస్‌ మేర తక్కువగా నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది.

మరోవైపు హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోతున్నాయి. ఫలితంగా జనం చలికి వణుకుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిన్న 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శేరిలింగంపల్లిలో అత్యంత కనిష్ఠంగా 8.8 డిగ్రీలు నమోదు కాగా, రాజేంద్రనగర్‌లో 9.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లో 10 నుంచి 15 డిగ్రీల మధ్య రికార్డయింది. నగరంలో మరో రెండు రోజులపాటు చలి తీవ్రత ఇలానే ఉంటుందని, ఆ తర్వాత క్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగి చలి తగ్గుతుందని వాతావరణశాఖ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement