Tuesday, May 7, 2024

సిద్ధుకు సీఎం.. డీకే కు డిప్యూటీ సీఎం.. అధిష్టానం మొగ్గు..

కర్ణాటక ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వైపే అధిష్టానం మొగ్గుచూపుతోంది. కాగా.. పవర్ షేరింగ్ కోసం డీకే శివకుమార్ తో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే గత 24గంటలుగా ఎడతెగని చర్చలు జరిపారు. అయితే పవర్ షేరింగ్ కు డీకే తిరస్కరించారు. ఇస్తే తనకే సీఎం పదవి ఇవ్వాలని, లేదంటే తనకు ఏ పదవి అక్కర్లేదని తేల్చి చెప్పారు. అలాగే సిద్ధరామయ్య కేబినెట్ లో కూడా చేరేది లేదని తేల్చివేశారు. అధిష్టానం డీకే అభ్యర్థిత్వానికి అనుకూలంగా ఉన్నప్పటికీ గతంలో అతనిపై ఉన్న కేసులు ముఖ్యమంత్రి పదవికి స్వీకరించేందుకు అడ్డంకిగా మారాయి. ముఖ్యమంత్రి అయిన తర్వాత మరోలా కేసులు, కోర్టుల వ్యవహారాలతో డీకే తలమునకలై ఉండే అవకాశాలు కనిపిస్తుండడంతో తప్పని పరిస్థితుల్లో సిద్ధారమయ్య వైపే కాంగ్రెస్ పెద్దలు మొగ్గుచూపారు.

ఈ క్రమంలోనే మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు సిద్ధరామయ్యకు ఉందని కాంగ్రెస్ ఎన్నికల పరిశీలకులు సోనియా దృష్టికి తీసుకెళ్లడంతో మొగ్గు సిద్ధరామయ్య వైపే చూపింది. దీంతో అధిష్టానం సైతం సిద్ధరామయ్యకే జై కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదీ కాకుండా పార్టీలో సీనియర్ నేతగా ఉన్న సిద్ధరామయ్య తన అనుభవం ద్వారా పార్టీని ముందుకు తీసుకెళ్తారని బలంగా నమ్మింది. ఒక వైపు సిద్ధూను ముఖ్యమంత్రిగా చేస్తూ.. మరో వైపు డీకేకు ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలని ఖర్గే బృందం నిర్ణయం తీసుకుంది. అలాగే కీలకమైన పదవులను డీకేకే ఇవ్వాలని ఇప్పటికే సిద్ధరామయ్య కు అధిష్టానం సూచించింది. ఈ పరిస్థితుల్లో సిద్ధరామయ్యే కర్ణాటక కు మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయని ఢిల్లీ నుంచి వార్తలు వినవస్తున్నాయి. ఇదిలా ఉంటే సిద్ధు ముఖ్యమంత్రి కాబోతున్నాడనే వార్తలు వెలువడుతున్న తరుణంలో బెంగళూరులోని ఆయన నివాసం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement