Monday, April 29, 2024

హుజురాబాద్ లో కేసీఆర్ ప్రచారం లేనట్లే.. TRS గెలుపు సాధ్యమేనా?

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక వేడిపెంచుతోంది. బుధవారంతో ప్రచారం పర్వానికి తెర పడనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు, నాయకులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. అయితే, టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హుజురాబాద్ లో ప్రచారం చేస్తారా? లేదా? అన్న ఉత్కంఠకు తెరపడింది. హుజురాబాద్ ప్రచారానికి సీఎం కేసీఆర్‌ వెళ్లడం లేదు. ఈసీ నిబంధనల మేరకు బుధవారం రాత్రి ఏడు గంటల వరకు గడువుండగా ప్రచారంపై మంగళవారం రాత్రి వరకు నిర్ణయం వెలువడలేదు.

కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల కారణంగానే తాము సీఎం కేసీఆర్‌ సభను నిర్వహించలేకపోయామని ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ తెలిపారు. ఉప ఎన్నికల్లో వేయి మందితోనే హుజూరాబాద్‌లో ప్రచార సభ జరపాలనే ఈసీ నిబంధన ఆచరణ సాధ్యం కాదు. దీనికి ప్రత్యామ్నాయంగా పొరుగు జిల్లాలోని ఎల్కతుర్తి మండలం పెంచికల్‌పేటలో సభ పెట్టాలని భావించారు. అయితే, భూమి చదును ప్రారంభించిన తర్వాత ఈసీ పొరుగు జిల్లాలనూ ఎన్నికల కోడ్‌ పరిధిలోకి తెచ్చింది. దీంతో అక్కడ సభ నిర్వహించడానికి వీలు లేకుండాపోయింది. సీఎం కేసీఆర్‌ సభ నిర్వహించకుండా అడ్డుకున్నదే బీజేపీ అని టీఆర్ఎస్ నేతలు మండిపతున్నారు. బీజేపీ ఎన్నికుట్రలు చేసినా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ విజయాన్ని ఆపలేరని ధీమా వ్యక్తంచేశారు.

కాగా, టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా సీఎం కేసీఆర్ కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఉపఎన్నిక నేపథ్యంలో తన ప్రచారం, దళితబంధు పథకాన్ని నిలిపివేయడంపై మండిపడ్డారు. ప్లీనరీ వేదికగానే హుజురాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

ఇది కూడా చదవండి: Huzurabad Bypoll: అభ్య‌ర్థుల‌కు పండ‌గే.. అద‌నంగా రెండు గంట‌ల సమయం

Advertisement

తాజా వార్తలు

Advertisement