Friday, April 26, 2024

వుహాన్ ల్యాబ్ నుంచే కరోనా లీకైంది: చైనా వైరాలజిస్ట్ లి మెంగ్ యాన్

కరోనా వైరస్ ఎలా పుట్టుకొచ్చింది… ఎక్కడినుంచి పుట్టుకొచ్చిందనే దానిపై ఇప్పటికీ కచ్చితమైన ఆధారాలు లేవు. చైనాలోని వుహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచే ఈ వైరస్ లీకై ఉండొచ్చునన్న అనుమానాలు మాత్రం బలంగా ఉన్నాయి. కరోనా వ్యాప్తి మొదలైన కొత్తలో ఈ కుట్ర కోణంపై విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ అమెరికాకు చెందిన ఆంటోనీ ఫౌచీ లాంటి అంటువ్యాధుల నిపుణులు అప్పట్లో ఈ కుట్ర కోణాలను కొట్టిపారేశారు. కానీ ఇదే ఆంటోనీ ఫౌచీ ఇప్పుడీ కుట్ర కోణాన్ని కొట్టిపారేయలేమని అంటున్నారు. ఇక దీనిపై చైనాలో కరోనా వ్యాప్తి మొదలై, ఇది ఇతర దేశాలకు పాకిన తొలినాళ్లలో డాక్టర్ లి మెంగ్ యాన్ అనే మహిళా వైరాలజిస్ట్ సంచలన విషయాలు వెల్లడించడం తెలిసిందే. చైనాకు చెందిన వైరాలజిస్ట్ వుహాన్ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ బయటికి లీకైందని నాడు తెలిపారు. ఆ తర్వాత ఆమె అజ్ఞాతంలోకి వెళ్లారు. మళ్లీ ఇన్నాళ్లకు లి మెంగ్ యాన్ తెరపైకి వచ్చారు. గతంలో తాను చేసిన ఆరోపణలు నిజమేనని ఇన్నాళ్లకు నిరూపితమయ్యాయని తెలిపారు. అందుకు అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌచీ ఈమెయిళ్లే రుజువు అని పేర్కొన్నారు.

కరోనా వైరస్ లీక్ కు సంబంధించి ఫౌచీ ఈమెయిళ్లలో ఎంతో విలువైన సమాచారం ఉందని వెల్లడించారు. డాక్టర్ ఫౌచీ ఇప్పటివరకు బయటికి వెల్లడించిన విషయాలకంటే ఎక్కువగానే ఆయన వద్ద కీలక సమాచారం ఉండొచ్చని లి వెంగ్ యాన్ అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ కు సంబంధించి వుహాన్ ల్యాబ్ లో కీలక ప్రయోగం జరిగిందన్న విషయం డాక్టర్ ఫౌచీకి గతేడాది ఫిబ్రవరి 1నే తెలిసిందని అన్నారు. చైనాలో తాను పనిచేసినంత కాలం చైనా పెద్దలు తనపై నిఘా ఉంచారని, గత జనవరి వరకు ఏంజరిగిందో వారికి తెలుసని, కానీ అధికార కమ్యూనిస్టు పార్టీ క్షేమం కోసం, వారి సొంత ప్రయోజనాల కోసం కీలక వివరాలు దాచారని ఆరోపించారు.

కాగా, డాక్టర్ ఫౌచీ ఈమెయిళ్లను మీడియా స్వేచ్ఛ చట్టం అనుసరించి పలు మీడియా సంస్థలు దక్కించుకున్నాయి. కరోనా వైరస్ పుట్టు పూర్వోత్తరాలపై ఇంత సమాచారం ఉన్నాగానీ డాక్టర్ ఫౌచీ మౌనంగా ఉండిపోయారా? అంటూ ఈమెయిళ్ల నేపథ్యంలో ఆసక్తికర చర్చ మొదలైంది. ఓ ఇంటర్వ్యూలో ఫౌచీ మాట్లాడుతూ, ఆ ఈమెయిళ్లను విమర్శకులు తప్పుగా అర్థం చేసుకున్నారని, వైరస్ మూలాలపై ఏ విషయాన్ని తాను దాచలేదని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement