Friday, March 1, 2024

Campaign Time – ఎన్నిక‌ల వేళ తెలంగాణ‌కు జాతీయ నాయ‌కులు ‘క్యూ’….

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ అసెంబ్లి పోలిం గ్‌కు ఇక పక్షం రోజుల స్వల్ప సమయమే ఉండడంతో రాజకీయపార్టీలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నా యి. ఇప్పటికే అధికార బీఆర్‌ఎస్‌ అధినేత సీఎం కేసీఆర్‌ సుడిగాలి ప్రచారం నిర్వహిస్తూ రోజుకూ మూడు, నాలుగు బహిరంగసభల్లో పాల్గొంటు న్నారు. అదే సమయంలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ల రాష్ట్ర అధ్యక్షులు, సీనియర్‌ నేతలు కూడా ప్రచారంలో దూకుడు పెంచారు. తాజాగా బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల అగ్రనేతలు, ముఖ్యనేతలు కూడా తెలంగాణలో ఎన్నికల ప్రచారంపై ఫోకస్‌ పెంచారు. ప్రస్తుతం పలు పార్టీల జాతీయ పార్టీల నేతలు తెలంగాణకు క్యూ కట్టారు. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రులు, బీజేపీ కి చెందిన కేంద్ర మంత్రులు ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నారు.

తాజాగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, బీజేపీ అగ్రనేత , కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఒక రోజు తేడాతో తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనను న్నారు. ఈ నెల 17న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తెలంగాణలో ఎన్నికల ప్రచారం కోసం వస్తుండగా, ఈ నెల 18న బీజేపీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇరువురు అగ్రనేతల షెడ్యూల్‌లో వరంగల్‌లో బహిరంగసభ ఉండడం గమనార్హం.

తెలంగాణ పర్యటనలో భాగంగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఈ నెల 17న పాలకుర్తి, వరంగల్‌, భువనగిరి బహిరంగసభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. ఇక బీజేపీ అగ్రనేత అమిత్‌ షా పార్టీ మేనిఫెస్టో విడుదల చేయనుండగా… కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ పార్టీ ఏర్పాటు- చేసిన బహిరంగసభ లో పాల్గొననున్నారు. అయితే ఈ ఇద్దరు అగ్ర నేతలు ఒకే రోజు అది కూడా ఒకే ప్రాంతం వరంగల్‌లోనే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఈ నెల 18న తెలంగాణకు వస్తున్న అమిత్‌ షా ఆ ఒక్క రోజులోనే హైదరాబాద్‌లో పార్టీ మేనిఫెస్టో విడుదల చేయడంతోపాటు నాలుగు చోట్ల బహిరంగ సభల్లో పాల్గొంటారు. నల్లగొండ, వరంగల్‌, గద్వాల, రాజేంద్ర నగర్‌ సభల్లో షా పాల్గొంటారు.

ఇప్పటికే బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, కాంగ్రెస్‌ నేతలు రేవంత్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క రాష్ట్రంలో ప్రతీ రోజూ కనీసం మూడు చోట్ల బహిరంగ సభల్లో పాల్గొంటూ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ మూడు పార్టీల ముఖ్యనేతలు ఒకరిపై మరొకరు చేసుకుంటున్న ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తాను బరిలో ఉన్న కామారెడ్డి, కొడంగల్‌ నియోజకవర్గాలపై దృష్టి పెడుతూనే ప్రతీ రోజూ మరో మూడు చోట్ల పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఇక బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ కరీంనగర్‌లో ప్రతి రోజూ ప్రచారం నిర్వహిస్తూనే అదే సమయంలో మరోక నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ సైతం తాను పోటీ చేస్తున్న హుజురాబాద్‌, గజ్వెల్‌పై ప్రత్యేక దృష్టిపెడుతూనే పార్టీ అభ్యర్థుల కోసం రోజూ రెండు చోట్ల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తాజాగా రాష్ట్ర నేతలకు జాతీయ నేతలు కూడా ఎన్నికల ప్రచారంలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఇన్ని రోజులు జరిగిన ఎన్నికల ప్రచారం ఒక ఎత్తుగా రానున్న 15 రోజుల్లో జరిగే ఎన్నికల ప్రచారం మరొక ఎత్తు అనేలా పరిస్థితులు మారిపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement