Thursday, November 7, 2024

పుతిన్ కీల‌క ప్ర‌క‌ట‌న‌- ఆందోళ‌న వ్య‌క్తం చేసిన బ్రిటన్‌ మంత్రి గిల్లియాన్‌ కీగన్

ప‌శ్చిమ దేశాలు ర‌ష్యాను నాశ‌నం చేయాల‌నుకుంటున్నాయ‌ని ఆ దేశ అధినేత పుతిన్ ఆరోప‌ణ‌లు చేశారు. యుద్ధాన్ని కొనసాగించేందుకు ప్రజలను, ఆర్థిక వ్యవస్థనూ సన్నద్ధంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు పుతిన్ చేసిన ప్రకటన మరోసారి పశ్చిమ దేశాల్లో గుబులు రేపుతోంది. ముందుగానే రికార్టు చేసిన ఓ ప్రకటనను రష్యా ప్రభుత్వ వర్గాలు బుధవారం విడుదల చేశాయి. ఉక్రెయిన్‌ ప్రజలను ఆయుధంగా వాడుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. రష్యాతో పరోక్ష యుద్ధాన్ని ప్రారంభించినందుకు పశ్చిమ దేశాలను ఆయన నిందించారు. విముక్త ప్రదేశాల్లో ప్రజలను కాపాడేందుకు అత్యవసరంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

అందుకే పాక్షిక సైనిక సమీకరణ చేపట్టేందుకు రక్షణ శాఖ అంగీకరించాలని కోరుతున్నానన్నారు. ఇప్పటికే డిక్రీపై సంతకాలు చేసినట్లు వెల్లడించారు. ఈ సమీకరణ కింద చేరే వారికి పూర్తిస్థాయి సైనిక దళాల హోదా లభిస్తుందన్నారు. ఈ సైనిక సమీకరణ నేటి నుంచే మొదలవుతుందని తెలిపారు. పశ్చిమ దేశాలు రష్యాపై అణు బెదిరింపులకు పాల్పడుతున్నాయని పుతిన్‌ ఆరోపించారు. అయితే.. దీనిపై స్పందించేందుకు మాస్కో వద్ద చాలా ఆయుధాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. తమ ప్రజలను రక్షించుకోవడానికి అన్ని వనరులు వినియోగిస్తామని తేల్చి చెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటనపై బ్రిటన్‌ మంత్రి గిల్లియాన్‌ కీగన్‌ స్పందిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ దేశాలను భయపెట్టేలా చాలా ఆయుధాలు ఉన్నాయంటూ పుతిన్‌ పేర్కొన్నారన్నారు. రష్యా అదనపు దళాలను సమీకరించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. పుతిన్‌ ప్రకటనను తీవ్రంగా పరిగణించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement