Monday, April 29, 2024

PUBG: పబ్‌జీ ఆట కోసం రైలును ఆపేసిన బాలుడు!

తన స్నేహితుడితో కలిసి పబ్జీ వీడియో గేమ్ ఆడేందుకు ఓ 12 ఏళ్ల బాలుడు ఏకంగా రైళ్లనే ఆపేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 30న బెంగళూరులోని యెలహంక రైల్వేస్టేషన్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మార్చి 30 మధ్యాహ్నం యెలహంక రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరాల్సిన కాచిగూడ ఎక్స్ ప్రెస్ రైలులో బాంబు పెట్టమంటూ రైల్వే కేంద్రానికి సమాచారం వచ్చింది. దీంతో హుటాహుటిన బాంబు స్క్వాడ్, ఇతర భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకుని స్టేషన్లో ఉన్న ప్రయాణికులను బయటకు పంపి, స్టేషన్ మొత్తాన్ని జాగిలాలతో జల్లెడ పట్టారు. అయితే ఎక్కడా బాంబు జాడ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

ఎవరైనా ఆకతాయి ఇలా తప్పుడు సమాచారం ఇచ్చి ఉండొచ్చని భావించారు. దీనిపై విచారణ చేపట్టారు. ఫోన్ చేసిన వ్యక్తి గురించి పోలీసులు ఆరా తీయగా అతడు 12 ఏళ్ల బాలుడని తేలింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా విస్తుపోయే విషయం చెప్పాడు. స్నేహితుడితో కలిసి పబ్ జీ గేమ్ ఆడుతున్నానని అయితే, తన స్నేహితుడు కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌లో వేరే ఊరు వెళ్లాల్సి ఉందని తెలిపాడు. అతడు వెళ్లిపోతే ఆట మధ్యలోనే ఆగిపోతుందని, కాబట్టి ప్రయాణాన్ని ఆపేందుకు బాంబు పెట్టానని ఫోన్ చేశానని చెప్పాడు. దీంతో పోలీసు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఘటనపై బాలుడి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేసు పెట్టకుండా మందలించి వదిలేశారు. బాలుడి తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement