Thursday, April 25, 2024

Sri Lanka Crisis: శ్రీలంకలో ముదిరిన సంక్షోభం.. మూకుమ్మడిగా కేబినెట్ మంత్రుల రాజీనామా

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని మహింద్ రాజపక్స కేబినెట్‌లోని మంత్రులందరూ మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 26 మంది కేబినెట్ మంత్రులు తమ రాజీనామా లేఖలను ప్రధానికి అందజేశారు. ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకే మంత్రులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

మరోవైపు శ్రీలంకలో ఆర్థిక సంక్షోభంతో ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు కొనసాగిస్తున్నారు. పెరిగిన ధరలు, నిత్యవసరాల కొరత, విద్యుత్‌ కోతలతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. పరిపాలన నుంచి రాజపక్స కుటుంబం తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు గతవారం వేలాది మంది జనం అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టారు. ఈ క్రమంలో పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీలంక అధ్యక్షుడు గొటబయా రాజపక్స రెండు రోజుల కిందట ఎమర్జెన్సీ విధించిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement