Monday, May 6, 2024

Blue Revolution – అగ్రి ‘బిజినెస్’ గా వ్య‌వ‌’సాయం’

న్యూఢిల్లి, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి

దీర్ఘకాలంగా వ్యవసాయాన్ని ఓ లాభసాటి పరిశ్రమగా మార్చాలని ప్రభుత్వాలు ఆకాంక్షిస్తున్నాయి. రోజురోజుకు సాగు వ్యయం పెరగడం, ఆదాయం తగ్గడంతో రైతులు ప్రత్యామ్నాయ వృత్తులవైపు మళ్ళుతున్నారు. తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరల్ని నిర్ణయించుకునే అధికారం ఉత్పత్తిదారుడికి లేని ఒకే ఒక రంగం వ్యవసాయం. ప్రతి ఏటా కనీస మద్దతు ధర కోసం రైతులు ఉద్యమాలు చేయాల్సి వస్తోంది. గత రెండు దశాబ్దాల ుగా రైతులు పల్లెలను వదిలి పటణాల వైపు తరలి పోతున్నారు. రైతు కూలీలు పొలాల్ని వదిలి నగరాలు, పట్టణాల్లో వాచ్‌మెన్‌లుగా మారిపోతున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో విస్తరించిన నీలివిప్లవ నేపథ్యంలో రొయ్యలు, చేపల చెరువుల వైపు యువత మొగ్గుచూపింది. ఈ ఉత్పత్తులకు విదేశాల్లో మంచి గిరాకీ ఉంది . పైగా ప్రభుత్వాలు ఆక్వా కల్చర్‌గా ప్రోత్సాహకాలిస్తున్నాయి. ఎగుమతులకు సహకరిస్తున్నాయి. తద్వారా ఆక్వా రైతులు విదేశీ మారకాన్ని పొందుతున్నారు. ప్రభుత్వానికి కూడా ఇది లాభసాటిగా మారింది. ఈ రంగంలోకి వస్తున్న యువత రోజురోజుకు పెరుగుతోంది. అత్యున్నత విద్యార్హతలు కలిగిన యువత కూడా ఇప్పుడు ఆక్వాకల్చర్‌పై ఆసక్తి పెంచుకుంటోంది. ఓ ఐదెకరాల ఆసామీ ఆక్వాకల్చర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కంటే ఎక్కువ సంపాదించగలుగుతున్నాడు. అలాగే రైతులకు కూడా సాగు కంటే తమ భూముల్ని చెరువులుగా మార్చడం లాభసాటిగా మారింది.

ఈ దశలో సాగును పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి, సమాజానికి కూడా ఉంది. వాస్తవానికి భూమిని నమ్ముకున్న రైతు ఎవరూ ఆ భూమిని ఎట్టి పరిస్థితుల్లో వదిలెళ్ళేందుకు ఇష్టపడరు. కానీ దానిపై కుటుంబ నిర్వహణకు అవసరమైన ఆదాయం సమకూరడం లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో భూమికి దూరమౌతున్నాడు. దేశంలో ప్రధాన పంటలు బియ్యం, గోధుమలు. వీటి మద్దతు ధర నుంచి విక్రయాల వరకు అన్నీ ప్రభుత్వాల అదుపాజ్ఞలకు లోబడి జరగాలి. ఓ ఊరి నుంచి మరో ఊరికి వీటిని తరలించాలన్నా ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి అవసరం. అలాగే ఎక్కడి నుంచి ఎక్కడ ఏ ఏ భూముల్లో ఏ ఏ రకం వంగడాలెయ్యాలి.. వాటిని ఎక్కడ కొనుగోలు చేయాలన్న అంశం నుంచి సాగును ఎలా జరపాలన్న ప్రతి అంశంపైన ప్రభుత్వ పెత్తనం, అజమాయిషీలు అధికంగా ఉన్నాయి. ఆక్వాకల్చర్‌తో పోలిస్తే వరి, గోధుమల సాగుపట్ల రైతుల్లో విముఖత ఏర్పడ్డానికి ఇదే ప్రధాన కారణం. వాస్తవానికి భారతదేశం అతిపెద్ద వ్యవసాయ దేశం. ఈ దేశంలో 68శాతం మంది ప్రత్యక్షంగా వ్యవసాయంపై ఆధారపడ్డారు.

కాగా ఇటీవల వెల్లడైన వార్షిక విద్యాస్థితి నివేదిక మేరకు గ్రామాల్లోని 14నుంచి 18ఏళ్ళ వయసుగల యువతలో 42శాతం మంది పట్టణాలకు వలస వెళ్ళేందుకే ఆసక్తి చూపుతున్నారు. సొంత పొలమున్న రైతుల్లో కూడా 79శాతం ప్రత్యామ్నాయ ఉపాధి వైపు మొగ్గుచూపుతున్నారు. కాగా రైతుల కుటుంబాల్లో 1.2శాతం మంది మాత్రమే తాము కూడా రైతులు కావాలని అభిలషిస్తున్నారు. దేశవ్యాప్తంగా జీవనోపాధిని ఎంపిక చేసుకునే విషయంలో వ్యవసాయం చిట్టచివరి స్థానానికి దిగజారిపోయింది. అలాగే జాతీయ నమూనా సర్వే ప్రకారం ప్రతి ఐదుగురు రైతుల్లో ముగ్గురు ఇతర వృత్తుల వైపు ఆకర్షితులౌతున్నారు. పూర్వీకుల పొలాల్ని కాపాడుకోవాలన్న ఆకాంక్ష కేవలం 12శాతం మందిలోనే ఉంది. రైతులకు సాగుకు సంబంధించి సరైన పరిజ్ఞానం అందడంలేదు. అవసరమైన ఇన్‌పుట్‌ లభించడంలేదు. సకాలంలో ప్రభుత్వాలు రుణాలు ఇవ్వడంలేదు. అవసరమైన పరికరాలకు సబ్సిడీలు జారీ చేయడం లేదు.

అష్టకష్టాలకు లోనై సాగు పూర్తి చేస్తే ఉత్పత్తుల్ని అమ్ముకునే వెసులుబాటు లేదు. ఈ అమ్మకాలపై ప్రభుత్వ నియంత్రణ రైతులకు విసుగు కల్పిస్తోంది. ఈ నియంత్రణను తొలగించాలి. బహిరంగ మార్కెట్లో అమ్ముకునే వెసులుబాటు కల్పించాలి. అవసరమైతే రైతులే సంఘాలుగా ఏర్పడి విదేశాలకు ఎగుమతి చేసేందుకు ప్రోత్సాహమివ్వాలి. రైతు తన ఉత్పత్తిధరను నిర్ణయించుకునే హక్కు కల్పించాలి. అప్పుడే సాగు పట్ల రైతుల్లో తిరిగి సానుకూలత పెరుగుతుంది. అప్పుడే ఆక్వాకల్చర్‌, సెరీకల్చర్‌, తరహాలో అగ్రికల్చర్‌కు కూడా డిమాండ్‌ పెరుగుతుందని సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement