Monday, April 29, 2024

Story : బిజెపి మాస్ట‌ర్ ప్లాన్ – మెగాస్టార్ చిరంజీవి మ‌రోసారి రాజ‌కీయాల్లోకి వ‌చ్చేనా !

మెగాస్టార్ చిరంజీవి ప‌లు సినీ ప్రాజెక్టుల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్నారు. కాగా ప్ర‌ధాని మోడీ జూలై 4న భీమ‌వ‌రంలో జ‌రిగే విప్ల‌వ‌వీరుడు అల్లూరి సీతారామ‌రాజు 125వ జ‌యంతి ఉత్స‌వాల‌ను ప్రారంభించ‌నున్నారు. ఈ వేడుక‌లో పాల్గొనాల‌ని చిరంజీవికి ఆహ్వానం వ‌చ్చింది. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి హోదాలో కిషన్ రెడ్డి పంపించారు.కాగా మెగాస్టార్ మోడీని కలసి పాలు పంచుకునే తొలి వేదిక ఇదే అవుతుంది . ఈ సందర్భంగా మోడీ ఎలాగూ మెగాస్టార్ తో మాట్లాడుతారు. అలా మెల్లగా ముగ్గులోకి దింపి ఏపీ బీజేపీకి అతి పెద్ద అండగా చిరంజీవిని చేసుకోవాలని బీజేపీ చూస్తోందని కధనాలు వినిపిస్తున్నాయి. చిరంజీవి కనుక తమతో కలసివస్తే కచ్చితంగా తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆయన జనసేనతో కూడా తోడు ఉంటుంది కాబట్టి ఏపీలో బలమైన రాజకీయ శక్తిగా అవతరించవచ్చు అన్నదే బీజేపీ మాస్టర్ ప్లాన్.

అల్లూరి 125వ జయంతి అంటే కచ్చితంగా మెగాస్టార్ వస్తారు. ఎందుకంటే ఒక దేశ భక్తుడి కార్యక్రమంలో పాల్గొనడం విధిగానే భావిస్తారు. ఇక ప్రధాని మోడీ వంటి వారి నుంచి ఆహ్వానం కాబట్టి దాన్ని గౌరవంగా స్వీకరిస్తారు . అయితే రాజకీయాల విషయం వస్తే మాత్రం నో అని చిరంజీవి సున్నితంగా తిరస్కరిస్తారు అనే అంటున్నారు సినీ వ‌ర్గాల వారు. ఆయన రాజకీయాల మీద పూర్తిగా అనాసక్తిగా ఉంటున్నారు. ఆయన కనుక తలచుకుంటే జనసేనలోనే ముఖ్య భూమిక పోషించేవారు . ఈ చిన్న లాజిక్ ని మరచి ఎవరి ఆశలు వారివి అన్నట్లుగా అంతా ప్రయత్నం చేస్తున్నారు.తనకు ఇష్టం లేని రంగానికి తాను వద్దు అనుకున్న దానిలోకి చిరంజీవిని ఆహ్వానించడం ద్వారా వారు తప్పు చేస్తున్నారా ఒప్పు చేస్తున్నారా అన్నది పక్కన పెడితే మెగాస్టార్ ని మాత్రం ఇబ్బంది పెడుతున్నారు అనే అనుకోవాలి.

ఈ జన్మ సినిమాలకే తాను అంకితం అని చిరంజీవి భావిస్తున్నారు. సో ఆయన మోడీ సభలో కనిపించినా రాజకీయ రీ ఎంట్రీ ఉంటుందని ఎవరూ అనుకోవడానికి అసలు వీలు లేదు అనే అంటున్నారు. చూడాలి మరి బీజేపీ మ్యాజిక్ చిరంజీవి మీద ఎలా పనిచేస్తుందో ఏమిటో. ప్రజారాజ్యం పార్టీని పెట్టి రెండు ధీటైన పార్టీల మధ్య పోటీకి నిలబడి డెబ్బై లక్షల ఓట్లు 18 ఎమ్మెల్యే సీట్లు సాధించి 18 శాతానికి పైగా ఓటు బ్యాంక్ ని తెచ్చుకున్న చిరంజీవి సామాన్యుడు కాడు అని బీజేపీ భావిస్తోంది. ఆయనకు సరైన రాజకీయ వ్యూహాలు లేకపోవడం వల్ల ఓటమి పాలు అయ్యారు తప్ప ఆయన పవర్ కి లోటు లేదని ఇక ఆయన అండ ఉంటే బీజేపీ లాంటి పార్టీలకు రాజకీయం ఏపీలో చేయడం చాలా ఈజీ అని కూడా తలపిస్తుంది.మ‌రి ఏమ‌వుతుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement