Friday, April 26, 2024

బర్డ్​ ఫ్లూ భయం.. కిలోమీటర్​ పరిధిలోని 25వేల కోళ్లను చంపేయాలని ఆదేశాలు..

మహారాష్ట్రలోని థానే జిల్లాలో బర్డ్ ఫ్లూ భయపెడుతోంది. కొత్త కేసుల వెలుగులోకి వస్తుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే భయపడాల్సిన అవసరం లేదని.. పరిస్థితి అదుపులో ఉందని అధికారులు తెలిపారు. ఇటీవల తహసీల్‌లో ఉన్న వెహ్లోలి గ్రామంలోని పౌల్ట్రీ ఫామ్‌లో సుమారు 100 కోళ్లు చనిపోవడంతో షాహాపూర్‌లో బర్డ్ ఫ్లూ కేసులు బయటపడ్డాయి.

మహారాష్ట్రలోని థానేలో చనిపోయిన కోళ్ల నుంచి సేకరించిన నమూనాలను పరీక్షల నిమిత్తం పూణేలోని లేబొరేటరీకి పంపించారు. కాగా, హెచ్5ఎన్1 ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా కారణంగానే అవి చనిపోయాయని టెస్టుల్లో నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని థానే జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) డాక్టర్ భౌసాహెబ్ దంగ్డే  తెలిపారు. షాహాపూర్ గ్రామంలో చాలా మందికి కోళ్ల పెంపకమే జీవనాధారం. అయితే బర్డ్​ ఫ్లూ కారణంగా 1కిలో మీటరు పరిధిలో ఉన్న అన్ని బ్రాయిలర్ కోళ్లను చంపాలని అధికారులు ఇప్పుడు ఆదేశించడం ఆందోళన కలిగిస్తోంది.

థానే జిల్లా కలెక్టర్ రాజేష్ నర్వేకర్ ఈరోజు 25,000 బ్రాయిలర్ కోళ్లను చంపాలని ఆదేశాలు జారీ చేశారు. షాహాపూర్‌లో నమోదైన బర్డ్‌ఫ్లూ మినహా జిల్లాలో మరే ఇతర ప్రాంతాల్లోనూ కేసులు నమోదు కాలేదని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావొద్దని ఆయన భరోసా ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement