Thursday, May 2, 2024

Big Story: అచ్చిరాని శాఖ‌ను హ‌రీశ్‌కు అప్ప‌గించిన్రా.. భ‌య‌ప‌డుతున్న అభిమానులు..

రాష్ట్రంలో ప్రస్తుతం వైద్యశాఖ పేరు వింటేనే చాలామంది మంత్రులు భయపడుతున్నారు. ఎందుకంటే ఈ శాఖ బాధ్యతలు చేప‌ట్టిన‌ ముగ్గురు మంత్రులు వివిధ సమస్యల్లో చిక్కుకుని ఉద్వాస‌న‌కు గుర‌య్యారు. ఉమ్మడి ఏపీలో దేవదాయ శాఖ లెక్క‌నే ఇప్పుడు తెలంగాణ‌లో హెల్త్ మినిస్ట్రీ అంటే చాలామంది వామ్మో అంటూ భ‌యాందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ మ‌ధ్యకాలంలో భూ వ్యవహారంలో మంత్రి వర్గం నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్ అయ్యారు. ఈటల తర్వాత ఈ శాఖను సీఎం కేసీఆర్ చేతికి బదిలీ చేయగా ఇప్పుడు.. అక్కడి నుంచి మళ్లీ మంత్రి హరీశ్​రావు ద‌గ్గ‌రికి చేరింది. ఇప్ప‌టికే హరీశ్ ద‌గ్గ‌రున్న‌ రెండు శాఖలు కూడా మాజీ మంత్రి ఈటల రాజేంద‌ర్ చేప‌ట్టిన‌వి కావ‌డం ఇక్క‌డ చెప్పుకోద‌గ్గ విష‌యం.

ఇప్పటికే ఈటల తర్వాత వేటు హరీశ్​రావుపైనే అంటూ ప్రతిపక్షాలు కూడా విమర్శలు గుప్పిస్తాయి. అధికార పార్టీలో అప్పుడప్పుడు చేసే ప్రకటనలతో కూడా పలుమార్లు హరీశ్ అంశం చర్చకు వస్తూనే ఉంటుంది. ఇప్పుడు హుజురాబాద్‎లో ఓటమి తర్వాత హరీశ్​రావు కేంద్రంగా చాలా ప్రచారమే జరుగుతోంది. ఇదే సమయంలో వైద్యారోగ్య శాఖ అప్పగించడంతో మరింత ఆందోళ‌న ఎక్కువైంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైద్యారోగ్య శాఖకు ముగ్గురు నేతలు మంత్రులుగా ఉన్నారు. ఈ శాఖను నిర్వర్తిస్తూ ఉద్వాసనకు గురైన వారిలో ఈటల రాజేందర్​ది రెండో స్థానం. తొలిస్థానం మాజీ మంత్రి, స్టేషన్​ఘన్​పూర్​ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్యది. 2014 జనవరిలో ఉప ముఖ్యమంత్రిగా, వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్న రాజయ్యను కేబినెట్ నుంచి తొలగించారు. కేసీఆర్ మొదటి ప్రభుత్వంలో రాజయ్య పై వేటు పడగా రెండోసారి ఈటల రాజేందర్​పై బలయ్యారు.

అదే విధంగా మొదటిసారి వైద్యారోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కూడా నకిలీ సర్టిఫికెట్ల వివాదంలో ఇరుక్కున్నారు. అది ఇంకా అప్పుడప్పుడు చర్చకు వస్తూనే ఉంది. లక్ష్మారెడ్డి మున్నాభాయ్ ఎంబీబీఎస్ డాక్టర్ అంటూ ఎంపీ రేవంత్ అప్పట్లో సంచలన ఆరోపణలు చేశారు. ఆ త‌ర్వాత‌ 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆరోగ్య శాఖ బాధ్యతలను ఈటల రాజేందర్‌కు అప్పగించగా.. లక్ష్మారెడ్డికి మాత్రం మంత్రి పదవి ద‌క్క‌లేదు.

- Advertisement -
ఆరోగ్యశాఖ మాజీ మంత్రి సి. లక్ష్మారెడ్డి

పాలిటిక్స్‌ను.. సెంటిమెంటును విడదీసి చూడలేం అంటారు చాలామంది నేత‌లు. దాదాపు ఎక్కువ మంది రాజకీయ నేతలు ముహుర్తాలు, సెంటిమెంట్లను నమ్మేవాళ్లే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో అయితే ఇది మరికాస్త ఎక్కువే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యారోగ్య శాఖలోనే ఎందుకిలా జరుగుతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మంత్రి ప‌ద‌వి చేప‌ట్టిన వారికివైద్యారోగ్య శాఖ అస్స‌లు కలిసి రావడం లేదా.. అనే నమ్మకాలు, విశ్వాసాలపై పొలిటిక‌ల్ స‌ర్కిళ్ల‌లో మరోసారి చ‌ర్చ మొద‌లైంది.

ఇంతకుముందు ఉమ్మడి ఏపీలో మంత్రుల శాఖలకు సంబంధించి ఓ సెంటిమెంట్ ఉండేది. అప్పట్లో దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఎవరికీ రాజకీయంగా కలిసి రాలేదు. ఆ శాఖ మంత్రిగా పనిచేసిన పలువురు నేతలు తదుపరి ఎన్నికల్లో ఓటమి పాలవ్వడం.. లేదంటే పదవులు దక్కకపోవడం ఉండేదని చెప్పుకుంటారు. అందుకే అప్పట్లో ఆ శాఖ బాధ్యతలు తీసుకోవాలంటేనే చాలామంది వెనకా ముందూ ఆలోచించే వాళ్లు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఈ తరహా సెంటిమెంట్ వైద్య, ఆరోగ్య శాఖలో కనిపిస్తుందని రాజకీయ ప్రముఖులు విశ్లేషించుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement