Thursday, May 23, 2024

Big Story: యువ‌తుల‌ ఫొటోలతో బేరం.. వాట్సాప్ లోనే వేలం.. పేద‌ కుటుంబాలే టార్గెట్‌..

ఈజీ మనీ కోసం కొంతమంది కొత్త దందా షురూ చేశారు.. ఈ మధ్య వెలుగులోకి వచ్చిన బుల్లిబాయి.. సుల్లీ డీల్స్​ తరహాలోనే అమ్మాయిలను అమ్మడానికి కొత్త కొత్త రూట్లలో వస్తున్నారు. సోషల్​ మీడియాలో పోస్టులు పెడుతూ వారి పని మరింత ఈజీగా ముగిస్తున్నారు. ఈ దందా దేశ రాజధాని ఢిల్లీ నుంచి పలు రాష్ట్రాలకు.. హైదరాబాద్​ వంటి మెట్రో సిటీస్​ నుంచి చుట్టుముట్టు జిల్లాలకు చేరింది. దీనికి ప్రధానంగా పేద కుటుంబాల్లో ఉన్న యువతులను టార్గెట్​గా చేసుకుని హ్యుమన్​ ట్రాఫికింగ్​కు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. వాట్సాప్​ చాట్​లో ఎవరు ఎవరనే విషయాలు పెద్దగా తెలియదు కాబట్టి వారి ఆగడాలు కొనసాగుతున్నట్టు సమాచారం. గ్రామీణ, పట్టణ ప్రాంత యువతీ, యువకుల్లారా.. ఇట్లాంటి ముఠాల వలలో చిక్కుకోవద్దు.. మీ జీవితాలను ఆగం చేసుకోవద్దని పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు..

ఈమధ్య కాలంలో బుల్లీభాయ్​, సుల్లీ డీల్స్​ వంటి యాప్​లతో అమ్మాల ఫొటోలను వెబ్​సైట్లో పెట్టి వారికి తెలియకుండా అమ్మేసిన ఘటనలు దేశంలో చాలాచోట్ల జరిగాయి. హైదరాబాద్​లోనూ ఓ యువ జర్నలిస్టుకు ఇట్లాంటి సమస్య ఎదురయ్యింది. దాంతో సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్​తో పాటు పోలీసు బాస్​ డీజీపీకి ఆమె కంప్లెయింట్ చేసింది. ఈ విషయాన్ని సీరియస్​గా తీసుకున్న పోలీసులు ఆ యాప్​ నిర్వాహకులపై చాలా సీరియస్​గానే ఫోకస్​ పెట్టారు.. అయితే యాప్​ నిర్వాహకుల్లో ఒక వ్యక్తిని ఢిల్లీ పోలీసులు యూపీలో అరెస్టు చేశారు. అక్కడ కూడా ఇదే తరహా ఘోరాలకు పాల్పడుతుండగా నిఘాపెట్టి పట్టుకున్నారు.. అయినా వారి ఆగడాలు ఆగలేదు..

ఈ ముఠా పనిచేసే విధానం ఎట్లంటే..

హైదరాబాద్ మ‌హాన‌గ‌రంతోపాటు.. చుట్టు పక్కల జిల్లాల్లోని ప‌లు గ్రామాల్లో ఆడపిల్లలు ఎక్కువగా ఉన్న నిరుపేద కుటుంబాలను గుర్తిస్తారు. వారి ఆర్థిక స్థితిగతులు, బలహీనతలను తెలుసుకుంటారు. తమ ముఠా సభ్యులతో ఏదో ఒక రకంగా ఆ కుటుంబాలకు దగ్గరవుతారు. ఆర్థికంగా ఆదుకుంటారు. తర్వాత వారి ఆడపిల్లల ఫొటోలు తీసుకుంటారు. వాటిని ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉన్న వ్యక్తులకు వాట్సా్‌ప్​లో పంపుతారు. వారికి ఆ అమ్మాయిలు నచ్చితే వాట్సా్ప్​ గ్రూపులోనే  వేలం నిర్వహిస్తారు. రూ.లక్షల్లో బేరం కుదరగానే.. నయానో బయానో కుటుంబ సభ్యులను ఒప్పిస్తారు. తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి కస్టమర్లను రప్పిస్తారు. గుట్టుచప్పుడు కాకుండా అమ్మాయిలను విక్రయించి నగరం దాటిస్తారు. ఇలా సిటీలో పదుల సంఖ్యలో ముఠాలు మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల 14 ఏళ్ల బాలికను తల్లి, అమ్మమ్మ సహకారంతో 61 ఏళ్ల వృద్ధుడికి రూ.5లక్షలకు అమ్మకానికి పెట్టిన ఉదంతం హైదరాబాద్​లోని బాలాపూర్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో 9 మంది ఉన్న గ్యాంగ్​ను రాచకొండ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు.

టార్గెట్​ ఎవరంటే..

- Advertisement -

కరోనా మహమ్మారితో పొట్ట చేతపట్టుకుని హైదరాబాద్​ వంటి మహానగరానికి బతకడానికి వచ్చిన వారికి ప్రస్తుతం చేతినిండా పనిలేదు.. కడుపునిండా తిండిలేదు. ఇటు సిటీలో ఉండలేని పరిస్థితి.. అటు సొంతూరు వెళ్లి తలెత్తుకోలేని గతి.. ఇట్లాంటి కఠిన పరిస్థితుల్లో ఈడుకు వచ్చిన ఆడపిల్లలను గుండెలమీద కుంపటిలా భావిస్తున్నారు చాలామంది తల్లిదండ్రులు. ఇట్లాంటి తరుణంలో ప్రస్తుతం నగరంలో మానవ అక్రమ రవాణా అనేది చాలా ఈజీ అయ్యిందంటున్నారు పోలీసులు. హైదరాబాద్​ సిటీలోని అక్రమ రవాణా ముఠాలు.. ఆటో డ్రైవర్లు, తాగుబోతు తల్లిదండ్రులు, అడ్డా కూలీలు, పనివాళ్లుగా బతుకుతున్న వారిలో ఆడపిల్లలు సంతానం ఎక్కువగా ఉన్న కుటుంబాలను టార్గెట్​ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ ముఠా సభ్యులు వారి బలహీనతలను ఆసరాగా చేసుకొని ఏదో ఒక విధంగా పరిచయం పెంచుకుంటున్నారు. చిన్న ఆపదలు, కష్టాలు తీరుస్తూ ఆర్థికంగా అండగా ఉంటారు. అలా వారిని బుట్టలో వేసుకొని కొంతకాలం పాటు.. నమ్మకంగా నటిస్తారు. ‘‘మీ సంపాదనతో ఆడపిల్లలను పెంచడం, చదివించడం, పెళ్లి  చేయడం చాలా కష్టమైన పని.. కాబట్టి ఇతర ప్రాంతాల్లో మాకు తెలిసిన పెద్ద సంస్థలు, సంపన్నులు ఉన్నారు. వారు నిరుపేద పిల్లలకు మంచి చదువు చెప్పించి, వారి కాళ్లమీద వారు బతికేలా చేస్తారు. వారే పెళ్లి చేసి మంచి జీవితాన్ని ఇస్తారు. అంతేకాదు.. పిల్లలను వారితో పంపితే.. మీ ఆర్థిక కష్టాలు కూడా తీరుస్తారు. అందుకు అవసరమైన డబ్బును ముందే చెల్లిస్తారు’’ అంటూ నమ్మిస్తారు.

ఎలా దందా సాగిస్తారంటే..

పేదల కష్టాలను ఆసరాగా చేసుకుని వారి పిల్లల ఫొటోలు తీసుకుని వాటిని ఇతర రాష్ట్రాల్లో, అరబ్‌ దేశాల్లో ఉన్న కస్టమర్లకు వాట్సా్‌ప్​లో పంపుతారు. కస్టమర్లు మెచ్చిన వారిని ఓకే చేస్తారు. ఒక ఫొటో ఎక్కువ మందికి నచ్చితే నగరంలో బ్రోకర్‌ ముఠాలు వాట్సా్ప్​లోనే వేలం నిర్వహిస్తాయి. వేలంలో ఎక్కువ  ధర ఇచ్చిన వారికి ఆ అమ్మాయిని అమ్మేస్తారు. వారి మనుషులు హైదరాబాద్‌కు వచ్చి డబ్బులు చెల్లించి తల్లిదండ్రుల చెంత నుంచి ఆ యువతిని తీసుకెళతారు. ముఠా సభ్యులు ముందుగానే వారిని ఒప్పించిన ప్రకారం.. కొంత డబ్బును చెల్లిస్తారు. తన బిడ్డ ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలని తల్లిదండ్రులు పిల్లలను అప్పగిస్తున్నారని విచారణలో తేలినట్లు పోలీసులు చెబుతున్నారు. 

రంగంలోకి రాచకొండ పోలీసులు.. 

యువతుల అక్రమ రవాణాపై చాలా సీరియస్​గా ఫోకస్​ పెట్టిన రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌.. ప్రత్యేకంగా యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. కేవలం ఒక్క రాచకొండలోనే గతేడాది 75 అక్రమ రవాణా కేసులు నమోదు చేసిన ఏహెచ్‌టీయూ టీమ్‌.. 198 మంది నేరస్థులను అరెస్టు చేసింది. వారి చెర నుంచి 249 మందిని రక్షించింది. అక్రమ రవాణాకు పాల్పడుతున్న 56 మంది నేరగాళ్లపై పీడీయాక్టు నమోదు చేసింది. త్వరలోనే మరికొన్ని ముఠాల భరతం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement