Sunday, April 28, 2024

Assam : విరిగిప‌డిన కొండ‌చ‌రియ‌లు.. ఒక‌రు మృతి

భారీ వ‌ర్షాల వ‌ల్ల కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌టంతో కామ‌రూప్ మెట్రోపాలిట‌న్ జిల్లాలోని ధీరెన్పారా ప్రాంతంలో ముక్తార్ అలీ అనే వ్యక్తి మరణించారు. ఈ విషయాన్ని అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఏఎస్డీఎంఏ) ఒక ప్రకటనలో తెలిపింది.కాగా అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 10 జిల్లాల్లో విస్తరించిన ఈ వరదల వల్ల ఈ ఈశాన్య రాష్ట్రంలో 37,000 మందికి పైగా ప్రజలు ప్రభావితం అయ్యారు. ఈ ఏడాది మొదటి వేవ్ లో వచ్చిన ఈ వరదల వల్ల బిశ్వనాథ్, దర్రాంగ్, ధేమాజీ, దిబ్రూగఢ్, హోజాయ్, లఖింపూర్, నాగావ్, సోనిత్పూర్, తిన్సుకియా, ఉదల్గురి జిల్లాలు ప్రభావితం అయ్యాయి. అయితే ఇప్పటి వరకు 37,535 మంది వరద ప్రభావానికి గురయ్యారు.

రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో వరద బాధితుల సంఖ్య 34,189గా ఉంది. లఖింపూర్ జిల్లాలో 25,275 మంది వరదల్లో చిక్కుకుపోయారు.బిశ్వనాథ్, దిబ్రూగఢ్ జిల్లాల్లో 3,000 మందికి పైగా, తిన్సుకియాలో మరో 2,000 మంది వరద ప్రభావానికి గురయ్యారని ఏఎస్డీఎంఏ బులెటిన్ పేర్కొంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 17 సహాయ పంపిణీ కేంద్రాలు, రెండు సహాయక శిబిరాలను ప్రారంభించారు. సోనిత్పూర్, దర్రాంగ్, నాగావ్, ఉదల్గురి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కరకట్టలు తెగిపోయాయి. ధేమాజీ, గోల్పారా, కరీంగంజ్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కరకట్టలు దెబ్బతిన్నాయి. ప్రభావిత జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో పలు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు నీట మునిగాయని, రోడ్లు, వంతెనలు కూడా వరద నీటిలో కొట్టుకుపోయాయని, పలు చోట్ల దెబ్బతిన్నాయని అధికారిక బులెటిన్ లో ప్రభుత్వం పేర్కొంది. బిశ్వనాథ్, దిబ్రూగఢ్, గోలాఘాట్, మోరిగావ్, నాగావ్, శివసాగర్, దక్షిణ సల్మారా, ఉదల్గురి జిల్లాల్లో కోతలు సంభవించాయి. దిమా హసావో జిల్లాలో కొండచరియలు విరిగిపడగా, కమ్రూప్ మెట్రోపాలిటన్, కచార్, నల్బరి జిల్లాల్లో పట్టణ ప్రాంతాల్లో వరదలు సంభవించాయని ఏఎస్డీఎంఏ నివేదిక తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement