Thursday, May 16, 2024

ఒక్క‌రోజులో ఐదు ల‌క్ష‌ల క‌రోనా కేసులు – విల విల‌లాడుతోన్న అమెరికా

క‌రోనాతో స‌త‌మ‌వుతుంటే మ‌రోప‌క్క ఒమిక్రాన్ కేసులు భారీగా న‌మోద‌వుతున్నాయి. ఒమిక్రాన్ దెబ్బ‌కు అగ్ర‌రాజ్యం అమెరికా గ‌జ గ‌జ లాడుతోంది. అమెరికాలో కేవ‌లం ఒక్క రోజులోనే ఐదు ల‌క్ష‌ల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. కాగా అందులో స‌గానికి పైగా ద‌క్షిణాఫ్రికాలో న‌వంబ‌ర్ లో వెలుగు చూసిన క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులే కావ‌డం ఆందోళ‌న‌కి గురి చేస్తుంది. క‌రోనా కొత్త కేసుల‌తో పాటు వైర‌స్ తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య సైతం పెరుగుతుంది. ఒమిక్రాన్ బారిన‌ప‌డుతున్న వారిలో రెండు డోసుల టీకాల‌తో పాటు బూస్ట‌ర్ డోలుసు సైతం తీసుకున్న వారు ఉండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. జాన్స్‌ హోప్‌కిన్స్‌ యూనివర్సిటీ వెల్ల‌డించిన క‌రోనా వైర‌స్ వివ‌రాల ప్ర‌కారం.. గడిచిన 24 గంటల్లో అమెరికాలో 5, 12, 000 కరోనా వైరస్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో సగం కంటే ఎక్కువ క‌రోనా వైర‌స్ ఒమిక్రాన్‌ వేరియెంట్‌ కేసులు ఉన్నాయి. అమెరికాలో క‌రోనా ప్ర‌భావం మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన గ‌రిష్ట కేసులు (ఒక్క‌రోజులో) ఇవే కావ‌డం ప్ర‌స్తుత క‌రోనా విజృంభ‌ణ‌కు అద్దం ప‌డుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు అమెరికాలో 54 మిలియన్ల కోవిడ్‌-19 కేసులు ఇప్పటిదాకా నమోదయ్యాయి.

అమెరికాలో క‌రోనా వైర‌స్ వెలుగుచూసిన త‌ర్వాత ఒక్క‌రోజులోనే న‌మోదైన అత్య‌ధిక కేసులు ఈ ఏడాది జ‌న‌వ‌రి 8న 2,94,015 కేసులు వెలుగుచూశాయి. ప్ర‌స్తుతం ఆ రికార్డును బ్రేక్ చేస్తూ ఐదు ల‌క్ష‌ల‌కు పైగా కొత్త కేసులు ఒకే రోజు న‌మోద‌య్యాయి. దీనికి ప్ర‌ధాన కార‌ణం ఒమిక్రాన్ వేరియంటేన‌ని నిపుణులు అభిప్ర‌య‌ప‌డుతున్నారు. అమెరికా డిజీస్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (CDC) వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. ప్రస్తుతం నమోదు అవుతున్న కేసుల్లో 58 శాతం(దాదాపు సగం కంటే ఎక్కువ) ఒమిక్రాన్‌ కేసులే ఉన్నాయి. ఒమిక్రాన్‌ కంటే ముందు డెల్టా వేరియెంట్‌ మూలంగానే అమెరికాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం నమోదు అవుతున్న కరోనా కేసుల్లో 41 శాతం డెల్టా వేరియెంట్ కేసులు ఉన్నాయి. ఇలా ఒక‌వైపు ఒమిక్రాన్‌.. మ‌రోవైపు డెల్టా వేరియంట్లు అమెరికాపై పంజా విస‌ర‌డంతో విల‌విల్లాడుతోంది అమెరికా.

Advertisement

తాజా వార్తలు

Advertisement