Saturday, May 4, 2024

ఎయిర్ టు ఎయిర్ రీ ఫ్యుయ‌లింగ్‌.. గ్రేట్ జాబ్ అంటున్న ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌!

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానాలకు యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) ఎయిర్‌ఫోర్స్‌ విమానం గాల్లోనే ఇంధనాన్ని నింపింది. భారత వాయుసేనకు చెందిన సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానాలు టాక్టికల్ లీడర్‌షిప్ ప్రోగ్రాంలో పాల్గొనడం కోసం ఈజిప్ట్ బయల్దేరి వెళ్లాయి. ఈ క్రమంలో 6 గంటలపాటు అవి నిరంతరాయంగా ప్రయాణించాయి. అవి యూఏఈ మీదుగా ప్రయాణిస్తుండగా.. ఆ దేశ వాయుసేనకు చెందిన ఎంఆర్‌టీటీ ఎయిర్‌క్రాఫ్ట్ వీటికి గాల్లోనే ఇంధనాన్ని నింపింది. ఈ విషయాన్ని ఇవ్వాల (శుక్ర‌వారం) ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వెల్లడించింది.

యూఏఈ ఎయిర్‌ఫోర్స్ సహకారాన్ని ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌ ప్రశంసించింది. వ్యూహాత్మక నాయకత్వ కార్యక్రమం కింద భారత్, ఈజిప్ట్ దేశాలకు చెందిన ఎయిర్‌ఫోర్స్ విమానాలు సంయుక్త విన్యాసాలు చేపట్టనున్నాయి. భారత్ రఫెల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్న సంగతి తెలిసిందే. అప్ప‌ట్లో ఈ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి బయల్దేరి ఎక్కడా ఆగకుండా భారత్‌ చేరుకున్నాయి. ఈ క్రమంలో కూడా యూఏఈ విమానాలే రఫెల్ జెట్లకు గాల్లో ఇంధనాన్ని నింపాయి. ఇరు దేశాల వైమానిక దళాల మధ్య ఉన్న బలమైన సంబంధాలకు ఇది నిదర్శనం అని అప్పట్లో ఫ్రాన్స్‌లోని భారత ఎంబసీ ప్రశంసించింది.

గాల్లోనే మరో విమానం సాయంతో విమానాల్లో ఇంధనాన్ని నింపడాన్ని ఏరియల్ రీఫ్యుయెలింగ్ లేదా ఇన్‌ఫ్లయిట్ రీఫ్యూయెలింగ్, ఎయిర్ టు ఎయిర్ రీఫ్యూయెలింగ్ అని పిలుస్తారు. సాధారణంగా భారీ ఆయుధాలతో గాల్లోకి ఎగిరే యుద్ధ విమానాలు తక్కువ ఇంధనంతో ఎగురుతాయి. తర్వాత గాల్లోనే ఇంధనాన్ని నింపుతారు. దీని వల్ల ఇంధన వాడకం తగ్గుతుంది. దూర ప్రయాణం చేసే విమానాల్లో కూడా ఎయిర్ టు ఎయిర్ రీఫ్యూయెలింగ్ వల్ల 35-40 శాతం ఇంధనం ఆదా అవుతుంది. 1920 కాలం నుంచే ఈ విధానం వాడుకలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement