Thursday, April 25, 2024

Big Story: అదిగదిగో యాదాద్రి, నల్లరాతితో నిర్మితమైన ఏకైక ఆలయం

గత యాదగిరిగుట్టతో పోల్చుకుంటే ఇప్పుడు యాదాద్రి ఆలయ రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. గతంలో మీరు చూసిన ఆలయానికి భిన్నంగా ఇప్పుడు పరిస్థితులున్నాయి. ఒక్క గర్భాలయంలోని స్వయంభువు మినహాయిస్తే ఆలయ పరిసరాలు, రూపురేఖలు అన్ని మారిపోయాయి. ఆలయ గోపురాలు, వాటి ఎదుట సింహాలు, ఏనుగులతో కూడిన శిల్పాలు, శంఖు చక్రాలు, తిరునామాలు, ఆరు రాజగోపురాలు, అష్టభుజ మండపాలు, గర్బాలయంపై విమానం, గుడిలోపల, గుడి వెలుపల మండపాలు ఇలా భక్తులను చూపుతిప్పుకోనివ్వని ఆధ్యాత్మిక సంపద పునర్‌నిర్మాణం తర్వాత యాదాద్రి ఆలయం మహా అద్భుతమనే చెప్పుకోవాలి..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: యాదాద్రీశుడి అలనాటి వైభవం చెక్కు చెదరకుండా ఆధునిక పరిజ్ఞానాన్ని మేళవించి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇప్పటి వరకు ఏ ఆలయంలో లేని విధంగా పూర్తిగా నల్లరాతి (కృష్ణ) శిలలతో నిర్మించిన ఏకైక ఆలయం యాదాద్రినే అని పండితులు ,శిల్పులు, స్తపతులు మొదలు సామాన్య భక్తుల వరకు చెబుతున్నారు. ఆలయంలో గుళ్లు, గోపురాలే కాదు ఆలయ గోడలు కూడా పూర్తిగా నల్లరాతితోనే నిర్మించారు. యాదాద్రి ఆలయ నిర్మాణానికి మొత్తం 2లక్షల టన్నుల నల్లరాతిని వాడారు. కాంబోడియాలో పూర్తిగా రాతితో నిర్మించిన ఆలయాలు ఉన్నా అక్కడ ఎర్రరాతి శిలతో నిర్మించగా… ఆలయ గోపురాలు కూడా యాదాద్రి కంటే చిన్నవిగానే ఉన్నాయని స్తపతులు చెబుతున్నారు.

ప్రాణంపోసుకున్న యాదాద్రి శిల్పాకళా శైలి..
యాదాద్రి ఆలయ పునర్‌నిర్మాణంలో భాగంగా కొత్త శిల్పకళా శైలి ప్రపంచానికి పరిచయమైంది.పల్లవ, చోళ, హోయసల, కాకతీయ శిల్పా శైలులన్నింటిని రంగరించి కొత్త శైలిలో యాదాద్రి ఆలయాన్ని పునర్మించి సరికొత్త శిల్పకలా చరిత్రకు నాంది పలికారు. ఆధ్యాత్మిక శోభ, శిల్పాకళా సౌందర్యం ఉట్టిపడేలా యాదాద్రి ఆలయ పునర్‌నిర్మాణం జరిగింది. ఆళ్వారుల నిలువెత్తు విగ్రహాలు ఈ గుడి ప్రత్యేకత. ఎక్కడా సిమెంట్‌, ఇటుక వాడకుండా… పూర్తిగా నల్లరాతిని… కర క్కాయ, బెల్లం, సున్నం, అలివేరా, జనపనార గుజ్జు మిశ్రమాన్ని వినియోగించి శిల్పం, శిల్పంకు మధ్యన ప్లాస్టింగ్‌ చేశారు. ఈ మిశ్రమం రోజులు గడిచే కొద్దీ చీమకూడా దూరనంతా విధంగా గట్టిపడుతుందని చెబుతున్నారు.

నిజమైన రూపులో స్వయంభువు దర్శనం
పునర్‌నిర్మాణం తర్వాత గర్భగుడిలోని స్వయంభువు లక్ష్మీనరసింహా స్వామి తన నిజ రూపంతో దర్శనమివ్వనున్నారు. ఎందుకంటే దాదాపు శతాబ్దకాలంగా స్వయంభువు విగ్రహంపై అర్చకులు పూస్తున్న సిందూరాన్ని తొలగించారు. దీంతో స్వామివారి స్వయంభువు రూపాన్ని దర్శించుకునే భాగ్యం భక్తులకు కలగనుంది.

స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొదటి ఆలయం యాదాద్రి
తెలంగాణ తిరుమలగా భక్తులను ఆధ్యాత్మిక సాగరంలో తేలియాడించేందుకు యాదాద్రి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆలయ స్వాతంత్ర భారతదేశ చరిత్రలో మొదటిసారి పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మించిన అతిపెద్ద ఆలయం యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి ఆలయం. అక్షరాల రూ.1200కోట్లతో యాదాద్రి ఆలయ పునర్‌నిర్మాణం చేపట్టారు. ఇందులో ప్రధాన ఆలయ నిర్మాణానికే రూ.240కోట్ల దాకా ఖర్చు చేశారు. మిగతా నిధులను ఇతర సౌకర్యాలు, మౌళిక సదుపాయాలకు ఖర్చు చేశారు.

- Advertisement -

వివాదాలు రావటంతో సమకాలీన అంశాల తొలగింపు
సమకాలీన పరిస్థుతుల అంశాలను ఆలయ గోడలపై చెక్కారు. అయితే వివాదాలు రావటంతో తొలగించారు. ఈ విషయంలో ఆలయ నిర్మాణ ఛైర్మన్‌ కిషన్‌రావు స్పందిస్తూ … సాధారణంగా ఆలయ నిర్మాణంలో అప్పుడు నెలకొన్న సమకాలీన పరిస్థితులను శిల్పాల రూపంలో చెక్కటం ఆనవాయితీ అని గుర్తు చేశారు. అహోబిలం, శ్రీశైలం వెళ్లినా నాటి నాణాలు, రవాణా వాహనాలు, ఆటలు తదితర అంశాలను చెక్కి ఉంటాయని గుర్తు చేశారు. అదేవిధంగా యాదాద్రి గోడలపై కారు, కమలం చెక్కటంపై వివాదాలు నెలకొనటంతో తొలగించామన్నారు.

ఈ నెల 28 నుంచి భక్తులకు స్వయంభువు దర్శనం…
ఆలయ పునర్‌నిర్మాణం తర్వాత యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి దర్శనం ఎప్పుడెప్పుడా అని తెలుగురాష్ట్రాలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజల ఎదురుచూపులు ఈ నెల 28 నుంచి ఫలించనున్నాయి. ఈ నెల 28 నుంచి సామాన్య భక్తులకు పునర్‌నిర్మించిన యాదాద్రి ఆలయంలో స్వంయభువుగా లక్ష్మీనర్సింహాస్వామి దర్శనమివ్వనున్నారు. ఈ నెల 28న మహాకుంభ సంప్రోక్షణ యాగం ముగుస్తుంది.

28న యాదాద్రికి సీఎం కేసీఆర్‌
సీఎం కేసీఆర్‌ ఈనెల 28న యాదాద్రి వెళ్లనున్నారు. ఆలయ ఉద్ఘాటన, మహాకుంభ సంప్రోక్షణ వైదిక పర్వాల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు 28న ప్రధానాలయంలో మహాకుంభ సంప్రోక్షణ మ#హూత్సవాన్ని నిర్వ#హంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం యాదాద్రిలో అడుగుపెట్టినప్పటి నుంచి కొండపైకి వెళ్లి దర్శనం చేసుకొని తిరిగొచ్చే వరకు పోలీసు అధికారులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement