Friday, April 26, 2024

73 మంది విద్యార్ధులకు కరోనా!

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రాల్లోని పలు పాఠశాలల్లో కరోనా కలకలం రేపుతోంది. గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో కరోనా​ బారినపడుతోన్న విద్యార్థుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన రెండు రోజుల్లో 73 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. వరుసగా విద్యార్థులు కోవిడ్ బారిన పడుతుండడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతోంది.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ పరిధిలోని పాలమాకులలోని గురుకుల పాఠశాలలో కరోనా విజృంభిస్తోంది. ఇక్కడి జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయంలో 45 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. పాఠశాలలోని 6 నుంచి 10వ తరగతి వరకు మొత్తం 846 మంది బాలికలు ఉండగా.. వారిలో దాదాపు 500 మందికి పరీక్షలు నిర్వహించారు. 45 మందికి కరోనా సోకినట్లు వైద్యులు వెల్లడించారు. మరికొంత మంది ఫలితాలు రావాల్సి ఉందని గురుకుల విద్యాలయ ప్రధానోపాధ్యాయురాలు తెలిపారు. పాఠశాలలో మిగిలిన విద్యార్థులకూ కొవిడ్ పరీక్షలు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

నిర్మల్ జిల్లా ముథోల్​లోని గిరిజన బాలికల గురుకులంలోనూ కరోనా కలకలం రేగింది. అక్కడ బాలికలు, ఒక సిబ్బంది సహా మొత్తం 27 మందికి వైరస్​ నిర్ధారణ అయింది. ఇక హైదరాబాద్ పాతబస్తీ రాజన్న బావి బీసీ వసతి గృహంలో 70 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 9 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement