Monday, May 6, 2024

Tamil Nadu: బ్యూటీ కాంటెస్ట్​లో పోలీసుల ర్యాంప్​వాక్​.. వేర్వేరు ప్రాంతాలకు ట్రాన్స్​ఫర్​ ఆర్డర్స్!​

తమిళనాడులో నిర్వహించిన బ్యూటీ కాంటెస్ట్​లో జరిగిన ర్యాంప్​వాక్ వారి ట్రాన్స్​ఫర్​కు కారణమైంది. హ్యాపీగా ఉన్న పోలీసు ఆఫీసరుతోపాటు మరో నలుగురు కానిస్టేబుళ్లు వేర్వేరు స్టేషన్లకు బదిలీ కావాల్సి వచ్చింది. దీనికంతటికీ మైలాడుతురై జిల్లాలో జరిగిన అందాల పోటీనే కారణంగా తెలుస్తోంది. డ్యూటీలో భాగంగా వెళ్లిన పోలీసు ఆఫీసర్​తోపాటు మహిళా కానిస్టేబుళ్లు  ర్యాంప్​పై వాక్​ చేయడంతో మైలాడుతురై జిల్లా ఎస్పీ ఎం. జవహర్‌.. సెంబనార్‌కోవిల్‌ పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న స్పెషల్‌ ఎస్సై సుబ్రమణ్యంతో పాటు కానిస్టేబుళ్లు అశ్విని, నిత్యశీల, రేణుక, శివనేశన్‌ని జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్‌లకు బదిలీ చేశారు.

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

జరిగిన విషయం ఇదే..

తమిళనాడులోని మైలాడుతురై జిల్లాలో జరిగిన అందాల పోటీల కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. జులై 31న రాత్రి ఓ మోడలింగ్​ కంపెనీ బ్యూటీ కాంటెస్ట్​, ర్యాంప్​వాక్​ వంటి పోటీలు నిర్వహించింది. దీనికి ముఖ్య అతిథిగా తమిళ నటి యాషిక ఆనంద్​ హాజరుకావడంతో ర్యాంప్​వాక్​ని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో భద్రత కారణాల రీత్యా పోలీసులు రావాల్సి వచ్చింది. అయితే.. ఈ కాంటెస్ట్​ జరుగుతున్న సమయంలో ఈవెంట్ హోస్ట్ భద్రతను పర్యవేక్షిస్తున్న పోలీసు అధికారిని, కానిస్టేబుళ్లను ర్యాంప్ వాక్ చేయాలని కోరారు.

ఈ క్రమంలో ప్రజల నుంచి వచ్చిన భారీ చప్పట్లతో అధికారులు సంతోషపడ్డారు. అయితే ఏం చేయాలో తెలియని సిచ్యుయేషన్​లో అప్పటికప్పుడు పోలీసు యూనిఫాంలోనే ర్యాంప్ వాక్ చేశారు. అయితే.. ఆ తర్వాత వారి ర్యాంప్​వాక్​ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ అయ్యింది. డ్యూటీ సమయంలో.. పైగా పోలీసు యూనిఫారంలో ర్యాంప్‌పై నడవడాన్ని కొంతమంది తప్పుపట్టారు. పోలీసులు ఉద్యోగ గౌరవాన్ని తగ్గించారని కొందరు అంటుండగా..కొంతమంది యువకులు మాత్రం పోలీసు సిబ్బంది తీరును అభినందిస్తూ పాజిటివ్​ కామెంట్స్​ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement