Thursday, April 25, 2024

Police Batch: స్నేహ హస్తం@ 2009.. దోస్తీకి సరైన నిర్వచనం

స్నేహానికన్న మిన్న లోకాన లేదురా.. అన్న దానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది 2009 పోలీస్ బ్యాచ్. 2009లో పోలీస్ శాఖలో ఎస్ఐలుగా ఎంపికైన పోలీస్ బ్యాచ్ వెల్ఫేర్ సొసైటీగా ఏర్పడి ఆపద వేళ ఆ బ్యాచ్ లోని మిత్రులకు వారి కుటుంబాలకు అండగా నిలుస్తోంది. వారి బ్యాచ్ లో శిక్షణ పొందిన వారిలో ఎవరికి ఏ కష్టమోచ్చినా మిగతావారంతా మేమున్నామంటూ అండగా నిలుస్తూ అందరికీ ఆదర్శప్రాయులవుతున్నారు. 2009లో పోలీస్ శాఖలో ఎస్సైలు ఎంపికైన 1,100 మంది ప్రస్తుతం పదోన్నతి పొంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇన్స్పెక్టర్ లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

రెండేళ్ల క్రితం 2009 బ్యాచ్కు చెందిన పోలీసు అధికారులు ఒక వెల్ఫేర్ సొసైటీని ఏర్పాటు చేసుకున్నారు. బ్యాచ్లో ఎవరికి కష్టం వచ్చినా చేయూతను అందించాలని నిర్ణయించుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆరు జోన్ లు ఉండగా ఒక్కో జోన్ కు ఇద్దరేసి అధికారులు బాధ్యత తీసుకొని వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. గ్రూపు సభ్యుల కష్టసుఖాలు ఎప్పటికప్పుడు 1100 మందికి తెలిసేలా సమాచారం ఇస్తున్నారు. ఆపద వేళ తలా కొంత వేసుకుని బాధిత కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగా బ్యాచ్ లోని ముగ్గురు పోలీసు అధికారులు మృతిచెందగా వారి కుటుంబాలను ఆర్థికంగా భారీ చేయూతనిచ్చారు.

గ్రూపు సభ్యుడు అయిన ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలోని తుని సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న అల్లు దుర్గారావు కరోనా బారిన పడి మృతి చెందిగా ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రూపులో సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సభ్యులు తోటి మిత్రుని కుటుంబానికి చేయూతనిచ్చేందుకు తోచినంత సహాయం చేశారు. 28 లక్షల రూపాయలు జమ కావడంతో మృతుని ఇద్దరు పిల్లలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున 20 లక్షల రూపాయలు డిపాజిట్ చేయడంతోపాటు మృతుడి తల్లిదండ్రులకు ఐదు లక్షల రూపాయలు భార్యకు మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించి గొప్ప మనసు చాటుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రి గణపవరం సీఐ భగవాన్ ప్రసాద్ షటిల్ ఆడుతూ గుండెపోటుతో మృతి చెందగా ఆయన కుటుంబానికి అండగా నిలిచారు. 27 లక్షల రూపాయల భారీ మొత్తాన్ని జమ చేసి ఇద్దరు పిల్లలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేయడంతో పాటు మృతుని తల్లిదండ్రులకు 5 లక్షల రూపాయలు భార్యకు రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు.

ఇటీవల సుల్తాన్ బజార్ సీఐ లక్ష్మణ్ భార్యతో కలిసి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చందర తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులకు చేయూతనిచ్చేందుకు బ్యాచ్ సభ్యులు ముందుకు వచ్చారు. తోటి మిత్రుని పిల్లలు అనాధలు కావద్దని భావించి 45 లక్షల రూపాయల భారీ మొత్తాన్ని జమ చేశారు. మృతుడి ఇద్దరు పిల్లలకు తలా పది లక్షల రూపాయల చొప్పున 20 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి పత్రాలను వారికి అందించారు.

- Advertisement -

మృతుడి తల్లికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. 20 లక్షల రూపాయలతో హైదరాబాదులోని అబ్దుల్లా పూర్ మెట్లు 200 గజాల స్థలాన్ని కొనుగోలు చేసి ఇద్దరు పిల్లల పేరిట రిజిస్ట్రేషన్ చేయించి ఆదివారం హైదరాబాద్లోని లియోనియా రిసార్ట్స్ లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో చిన్నారులకు అందజేసి గొప్ప మనసు చాటుకున్నారు. 11 ఏళ్ల తర్వాత హైదరాబాద్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 2009 బ్యాచ్ కు చెందిన పోలీసు అధికారులు పాల్గొని మృతి చెందిన పోలీసు అధికారి లక్ష్మణ్ పిల్లలకు మేమున్నామంటూ భరోసా కల్పించారు. తోడబుట్టిన వారికి ఆపద వస్తేనే దూరంగా ఉంటున్న సమాజంలో లో తోటి స్నేహితుడి కుటుంబాలకు అండగా నిలుస్తూ దోస్తీకి నిర్వచనంగా నిలుస్తున్న 2009 బ్యాచ్ కు చెందిన పోలీసు అధికారులు నిజంగా అందరికీ ఆదర్శప్రాయులే.

Advertisement

తాజా వార్తలు

Advertisement