Sunday, June 16, 2024

RR : మంచు కుర‌వ‌లా…అందుకే ఓడిపోయాం..సంజూ శాంస‌న్

మిడిల్ ఓవర్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోవడం తమ విజయవకాశాలను దెబ్బతీసిందని రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శుక్రవారం జరిగిన క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్ 36 పరగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన సంజూ శాంసన్.. డ్యూ రాకపోవడం, పిచ్ పూర్తిగా మారిపోవడం తమ ఓటమిని శాసించిందని చెప్పాడు.

- Advertisement -

‘ఇదో బిగ్ మ్యాచ్. మా బౌలింగ్ ప్రదర్శన పట్ల గర్వపడుతున్నా. బ్యాటింగ్ వైఫల్యం మా ఓటమిని శాసించింది. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో సన్‌రైజర్స స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు మా దగ్గర ఆప్షన్స్ లేవు. అదే మా పతనాన్ని శాసించింది. డ్యూ వస్తుందని మేం ఆశించాం. కానీ రాలేదు. ఇక మేం ఊహించిన విధంగా పిచ్ లేదు. సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో పూర్తిగా మారిపోయింది. బంతి బాగా టర్న్ అయ్యింది. ఈ అడ్వాంటేజ్‌ను సన్‌రైజర్స్ స్పిన్నర్లు అద్భుతంగా వాడుకున్నారు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో మా కుడి చేతి బ్యాటర్లను పెవిలియన్ చేర్చారు. అక్కడే ఆటలో పైచేయి సాధించారు.

లెఫ్టార్మ్ స్పిన్‌లో బంతి ఆగి వచ్చింది. మే రివర్స్ స్వీప్ షాట్స్‌తో పాటు క్రీజును బాగా ఉపయోగించుకోవాల్సింది. ఈ సీజన్‌తో పాటు గత మూడేళ్లుగా మేం అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాం. ఇదంతా మా ఫ్రాంచైజీ గొప్పతనం వల్లే సాధ్యమైంది. దేశానికి మేం ప్రతిభ కలిగిన ఆటగాళ్లను అందజేస్తున్నాం. రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ భవిష్యత్తులో భారత జట్టు తరఫున కూడా రాణిస్తారు. సందీప్ శర్మ ప్రదర్శన నాకు చాలా సంతోషాన్నిచ్చింది. వేలంలో ఎవరూ కొనకపోయినా.. రిప్లేస్‌మెంట్ ఆటగాడిగా వచ్చి తన విలువను చాటుకున్నాడు. గత రెండేళ్లుగా సందీప్ శర్మ గణంకాలు పరిశీలిస్తే బుమ్రా తర్వాతి బౌలర్‌గా కనిపిస్తాడు. ఫైనల్ మ్యాచ్‌లో కేకేఆర్, సన్‌రైజర్స్ జ‌ట్లు ఈ పిచ్ కండిషన్స్ సరిగ్గా సరిపోతాయి. పవర్‌ప్లేలో ఎవరూ పై చేయి సాధిస్తారో చూడాలి. సన్‌రైజర్స్ బ్యాటర్లు దూకుడుగా ఆడి మ్యాచ్‌ను లాగేసుకుంటారు. కేకేఆర్ కూడా చాలా ఆత్మవిశ్వాసంతో ఉంది. ఉత్సాహంగా ఎదురు చూస్తోంది. ఫైనల్ మ్యాచ్ గొప్ప గేమ్‌గా ఉండనుంది.’అని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement