పారిస్: ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో పలు అంతర్జాతీయ పోటీల్లో నిషేధానికి గురైన రష్యా క్రీడాకారులకు తాజాగా అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది పారిస్ ఆతిథ్యమిస్తున్న ఒలింపిక్స్ పోటీల్లో రష్యాతో పాటు బెలారస్ అథ్లెట్లు తటస్థ దేశాల జెండా కింద పోటీపడాలని స్పష్టం చేసింది. అంతేకాదు విశ్వక్రీడల్లో పాల్గొనేందుకు ఈ దేశాల పాస్‌పోర్టుతో వచ్చే క్రీడాకారులను అనుమతించబోమని వెల్లడించింది.
‘ప్రపంచ క్రీడల్లో పోటీపడుతున్న ఆటగాళ్ల వ్యక్తిగత హక్కులను గౌరవిస్తాం. ఆయా దేశాల ఒలింపిక్ కమిటీలను సస్పెండ్ చేసినప్పటికీ అథ్లెట్ల మానవ హక్కులకు ఎలాంటి భంగం కలిగించం’ అని ఐఓసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకూ రష్యా నుంచి ఎనిమిది మంది, బెలారస్ నుంచి ముగ్గురు మాత్రమే తటస్ఠ అథ్లెట్లుగా అర్హత సాధించారు. మరోవైపు ఉక్రెయిన్ నుంచి 60 మంది క్వాలిఫై అయ్యారు. ప్యారిస్ ఒలింపిక్స్ పోటీలకు ఇప్పటివరకూ పలు దేశాలకు చెందిన 4,600 మంది అథ్లెట్లు అర్హత సాధించారు.