Sunday, March 3, 2024

విభజన చిక్కుముడులు వీడేనా.. జల వివాదాలు సర్దుమణిగేనా

అమరావతి, ఆంధ్రప్రభ: తెలంగాణలో ఏర్పాటయిన కొత్త ప్రభుత్వం రాష్ట్ర విభజన అంశాలపై ఏ రకంగా స్పందిస్తుందనే విషయమై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది.. పెండింగ్‌లో ఉన్న విభజన అంశాలు ఏ రకంగా పరిష్కారమవుతాయనేది ఆసక్తికరంగా మారింది.. దశాబ్ద కాలంగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణకు సంబంధించి కొన్న కీలకమైన అంశాలపై అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్‌ల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.. దీనికి తోడు కృష్ణా, గోదావరి జలాల వివాదాలు రగులుకుంటున్నాయి.. విభజన చట్టంలోని 9, 10, 13 షెడ్యూల్డ్‌ ఆస్తుల బదలాయింపుపై ఇప్పటికీ ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరలేదు.. కేంద్ర సమన్వయ యత్నాలు ఫలించలేదు.. వచ్చే ఏడాది జూన్‌తో రాష్ట్ర విభజన జరిగి దశాబ్దకాలం పూర్తి కానుంది.

ఇప్పటికీ ఇంకా పెండింగ్‌లో ప్రధాన హామీలతో పాటు పంపకాలపై స్పష్టత రాలేదు..ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌తో ఉన్న అనుబంధం కూడా వచ్చే జూన్‌తో ముగియనుంది. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కేంద్రం అప్పట్లో ఇచ్చిన హామీలు.. తెలంగాణ నుంచి ఆస్తుల బదలాయింపుపై ఇప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు.. ఏళ్లు గడిచి ప్రభుత్వాలు మారుతున్నా విభజన చిక్కుముడులు వీడటంలేదు. ప్రత్యేక హోదాతో పాటు అనేక కీలక డిమాండ్లకు కాలపరిమితి కూడా ముగియనుంది. దీనికితోడు విభజన చట్టం ప్రకారం కృష్ణా, గోదావరి జలాల కేటాయింపు.. వినియోగంపై సరికొత్త వివాదాలు రగులుకుంటున్నాయి.. తెలంగాణ ఎన్నికల రోజునే నాగార్జునసాగర్‌ డ్యాంకు సంబంధించి రెండు ప్రభుత్వాలు కత్తులు దూసుకునే పరిస్థితి నెలకొంది.

విభజన చట్టం ప్రకారం నదీ జలాల వినియోగంపై ట్రిబ్యునళ్లు ఏర్పాటు కావాల్సి ఉంది.. అయితే దామాషా ప్రకారం నీటి వాడకంపై కూడా ఇరు రాష్ట్రాలు పరస్పరం అభ్యంతరాలు వ్యక్తం చేసుకోవటంతో పాటు అడ్డుకట్టలు వేస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఓ వైపు కేంద్రం, మరోవైపు తెలంగాణ ప్రభుత్వంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనెరెడ్డి సాన్నిహిత్యంగా వ్యవహరిస్తున్నారు.. విభజనానంతరం 2014లో అవశేష ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ కొన్నాళ్ల తరువాత ఎన్డీయేతో విబేధించి వైదొలగటంతో విభజన సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేదు. గత సార్వత్రిక ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత సీఎం జగన్‌ విభజన హామీల అమలు, రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలపై అనేక సార్లు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్‌షాలను కలుసుకోవటంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు.. తెలంగాణతో షెడ్యూల్డ్‌ ఆస్తుల బదలాయింపు వల్ల రాష్ట్రానికి రూ. 1.97 లక్షల కోట్ల ఆస్తులు సమకూరతాయి.. దీంతో పాటు తెలంగాణ జెన్‌కో ఏపీకి రూ. 8వేల కోట్ల విద్యుత్‌ బకాయిలు చెల్లించాల్సి ఉంది.

జల వివాదాలపై సుప్రీం కోర్టులో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.. మరో నాలుగు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి రావాల్సిన వనరులపై సీఎం జగన్‌ ఫోకస్‌ పెంచారు. ఇందులో భాగంగానే తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో వ్యవహరించిన తరహాలోనే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సంబంధాలు కొనసాగించాలనే యోచనతో ఉన్నారు. ఇటీవల నాగార్జునసాగర్‌ వివాదంపై రేవంత్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. కర్నూలు – పాలమూరు మధ్య గతంలో కృష్ణాజలాల వివాదాన్ని గుర్తుచేస్తూనే మరోవైపు చర్చలు లేదా కోర్టుల ద్వారా వీటిని పరిష్కరించుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి నదీజలాల వివాదంలో ఇరు రాష్ట్రాల వాటాను ట్రిబ్యునల్‌ తేలిస్తే అందుకు తగ్గట్టుగా వ్యవహరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దీంతో పాటు షెడ్యూల్డ్‌ ఆస్తులకు సంబంధించిన వివాదాలే పరిష్కారం కావాల్సి ఉంది.. ప్రత్యేక హోదా మినహా మిగిలిన రాష్ట్ర విభజన హామీల అమలుకు సంబంధించి కేంద్రప్రభుత్వంతో సఖ్యతగా వ్యవహరిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేశారనేది సుస్పష్టం. గతంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్రంలోని ఎన్డీయేతో భాగస్వామ్యం వహిస్తున్న నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలన్నీ పరిష్కారం కాగలవని ఆశించారు. అయితే మధ్యలోనే ఇరు పార్టీల సంబంధాలు తెగదెంపులు కావటంతో యథా స్థానం ప్రవేశయామి అనే చందంగా మారింది. షెడ్యూల్‌ 13 ప్రకారం రాష్ట్రానికి జాతీయ స్థాయి సంస్థలు ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎం, ఐఐఎస్‌ఈఆర్‌, కేంద్రీయ విద్యాలయం, పెట్రోలియం, వ్యవసాయ విశ్వవిద్యాలయాలతో పాటు ట్రిపుల్‌ ఐటీలు ఏర్పాటు కావాలి.

అయితే కేంద్రం కొన్ని సంస్థల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసినా ఏటా అరకొర నిధులు కేటాయించటం వల్ల వసతుల కల్పన జరగటంలేదు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయంతో పాటు మరో కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి జగన్‌ ప్రతిపాదనలు చేశారు. ఇవి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.. ఇక షెడ్యూల్‌ 9,10 ప్రకారం శిక్షణా సంస్థల విభజన, సింగరేణి కాలరీస్‌కు సంబంధించి పంపకాలు జరగాల్సి ఉంది. షెడ్యూల్డ్‌ ఆస్తులకు సంబంధించి 68 సంస్థల విభజనకు తెలంగాణ ప్రభుత్వం గతంలో సానుకూలత వ్యక్తం చేసి మధ్యలో మోకాలడ్డటంతో పరిష్కారం కాలేదు.

దీంతో కేంద్ర ప్రభుత్వం విభజన అంశాల పరిష్కారంలో రెండు రాష్ట్రాల మధ్య సమన్వయానికి కమిటీని ఏర్పాటు చేసింది. దీనిపై సుప్రీం కోర్టు కూడా కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఉన్నత విద్యామండలికి సంబంధించిన ఆస్తుల్లో వాటాను ఏపీకి బదలాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవటంలో సీఎం జగన్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించారనేది స్పష్టమవుతోంది. విభజన హామీల్లో ప్రధానంగా జాతీయ హోదా ప్రాజెక్టు పోలవరం, భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు విశాఖ రైల్వేజోన్‌, కడప స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు బాధ్యత నేరుగా కేంద్ర ప్రభుత్వానిదే అయినప్పటికీ పోలవరం విషయంలో తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల నుంచి ఎదురైన పేచీలను సీఎం జగన్‌ సమన్వయపరచుకోగలిగారు.

కేంద్రం నిధుల విడుదలతో పాటు సవరించిన అంచనాలతో డీపీఆర్‌-2 ఆమోదిస్తే పోలవరం గట్టెక్కినట్లే అనేది స్పష్టమవుతోంది.. ఇక షెడ్యూల్డ్‌ ఆస్తులు, నాగార్జున సాగర్‌, శ్రీశైలం జలాశయాలతో పాటు రాయలసీమ ప్రాంత ప్రయోజనాలు ముఖ్యం. ఇందుకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పరస్పర సహకారం అనివార్యం.. పార్టీలు వేరైనా ఇరు ప్రాంతాల ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్పందించాల్సిన బాధ్యత ఇద్దరు ముఖ్యమంత్రులపై ఉందనటంలో ఎలాంటి సందేహంలేదు.. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి సీమాంధ్ర ప్రజల మనోభావాలను గౌరవిస్తామని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement