Thursday, April 25, 2024

Shikhar Dhawan : నా జిడ్డు బ్యాటింగ్ తోనే ఓడాం – శిఖ‌ర్ ధావ‌న్

తన జిడ్డు బ్యాటింగ్‌తో పాటు విరాట్ కోహ్లీ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను నేలపాలు చేయడం తమ ఓటమిని శాసించిందని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

- Advertisement -

ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన శిఖర్ ధావన్.. 10-15 పరుగులు తక్కువగా చేయడం ఓటమికి కారణమైందన్నాడు. ‘ఇదో అద్భుతమైన మ్యాచ్. ఈ గేమ్‌లో మేం పుంజుకొని మరి ఓటమిపాలయ్యాం. మేం 10-15 పరుగులు తక్కువగా చేశాం. తొలి 6 ఓవర్లలో నేను చాలా స్లోగా బ్యాటింగ్ చేశాను.

మేం తక్కువగా చేసిన 10-15 పరుగులతో పాటు విరాట్ కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌ నేలపాలు చేయడం మా ఓటమిని శాసించింది. అతని క్యాచ్ వదిలేయడం ఈ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. క్లాస్ ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీ క్యాచ్‌ను వదిలేసి మేం మూల్యం చెల్లించుకున్నాం. మేం ఆ క్యాచ్ పట్టి ఉంటే రెండో బంతికే మాకు మూమెంటమ్ లభించేది. కానీ మేం అవకాశాన్ని చేజార్చుకున్నాం. పిచ్ చూడటానికి బాగున్నా.. మంచి వికెట్ అయితే కాదు. బంతి ఆగుతూ వచ్చింది. అనూహ్య బౌన్స్‌తో పాటు టర్న్ లభించింది. 70 శాతం బాగానే ఉన్నా.. మరో 30 శాతం విభిన్నంగా స్పందించింది. దాంతో బ్యాటింగ్‌కు ఇబ్బంది అయ్యింది. నేను చేసిన పరుగుల పట్ల సంతోషాంగానే ఉన్నా.. పవర్ ప్లేలో నేను కాస్త వేగంగా ఆడాల్సింది. ఆ ఒక్క విషయమే నన్ను వెంటాడుతోంది. వరుసగా వికెట్లు కోల్పోవడంతో నేను ఒత్తిడికి గురయ్యాను. స్వల్ప లక్ష్యమే అయినా.. ఆఖరి ఓవర్ వరకు మ్యాచ్‌ను తీసుకెళ్లాం. హర్‌ప్రీత్ బ్రార్ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. ముఖ్యంగా లెఫ్టాండర్స్‌ను ఇబ్బంది పెట్టాడు. తీవ్ర ఒత్తిడిలోనూ జట్టుకు కావాల్సిన బ్రేక్ త్రూలు అందించాడు.

తొడ కొట్టే సంబరాలు పంజాబ్‌లో చాలా ఫేమస్. ఇది కబడ్డీ నుంచి వచ్చిన సంప్రదాయం. థై ఫైవ్ సెలెబ్రేషన్స్‌కు అభిమానులు బాగా కనెక్ట్ అవుతారు. హర్‌ప్రీత్ బ్రార్ కూడా థైఫైవ్ సెలెబ్రేషన్స్ చేయడం సంతోషంగా ఉంది.’అని శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు.
శిఖ‌ర్ ఫోర్ల రికార్డ్..

ఐపీఎల్ లో టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ కు ప్రత్యేక స్థానం ఉంది. 2008 నుంచి ఇప్పటివరకు నిలకడగా రాణించే అతి కొద్ది మంది ప్లేయర్లలో ధావన్ ఒకడు. ఇప్పటివరకు 200 వందలకు పైగా మ్యాచ్ ల్లో 6000 లకు పైగా పరుగులు సాధించాడు. వీటిలో రెండు సెంచరీలతో పాటు ఏకంగా 50 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ లో తన పేరు మీద ఎన్నో రికార్డులు లిఖించుకున్న గబ్బర్.. తాజాగా ఎవరికీ సాధ్యం కాని ఘనతను అందుకున్నాడు.

ఐపీఎల్ లో భాగంగా ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ ఆడుతుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ధావన్ అరుదైన రికార్డ్ సాధించాడు. ఐపీఎల్ చరిత్రలోనే 900 ఫోర్లు కొట్టిన తొలి ప్లేయర్ గా రికార్డ్ సృష్టించాడు. ధావన్ తర్వాత స్థానంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 878 ఫోర్లతో రెండో స్థానంలో నిలిచాడు. వార్నర్ (877), రోహిత్ (811) వరుసగా మూడు నాలుగు స్థానాల్లో నిలిచారు.

ఈ మ్యాచ్ కు ముందు 897 ఫోర్లతో ఉన్న శిఖర్.. ఈ మ్యాచ్ లో 5 ఫోర్లు బాదాడు. దీంతో అతని ప్రస్తుత ఐపీఎల్ ఫోర్ల సంఖ్య 902 కు చేరింది. మొత్తం 37 బంతులు ఎదుర్కొన్న ఈ స్టార్ ఓపెనర్ 45 పరుగులు చేసి ఔటయ్యాడు. ధావన్ రాణించడంతో పంజాబ్ ప్రస్తుతం 15 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement