Saturday, June 15, 2024

Archery World Cup: తుదిపోరుకు జ్యోతి బృందం

ఆర్చరీ ప్రపంచకప్‌ల్లో ప్రపంచ నంబర్‌వన్‌ భారత మహిళల కాంపౌండ్‌ జట్టు దూకుడు కొనసాగిస్తోంది. గత నెలలో షాంఘైలో జరిగిన తొలి అంచె ప్రపంచకప్‌లో పసిడి నెగ్గిన జ్యోతి సురేఖ, పర్ణీత్‌ కౌర్, అదితి స్వామి త్రయం.. తాజాగా రెండో అంచె పోటీల్లోనూ ఫైనల్‌కు దూసుకెళ్లింది.

సెమీస్‌లో భారత్‌ 233-229 తేడాతో ప్రపంచ నాలుగో ర్యాంకు అమెరికాపై విజయం సాధించింది. క్వాలిఫికేషన్‌లో రెండో స్థానం సాధించిన భారత్‌ త్రయానికి బై దక్కడంతో నేరుగా క్వార్టర్స్‌లో ఇటలీతో తలపడింది. ఆ మ్యాచ్‌లో మన ఆర్చర్లు 236-234తో గెలిచారు.

- Advertisement -

పసిడి కోసం శనివారం ఏడో ర్యాంకు టర్కీతో భారత్‌ తలపడుతుంది. మరో సెమీస్‌లో టర్కీ 234-233తో టాప్‌సీడ్‌ దక్షిణ కొరియాకు షాకిచ్చింది. మరోవైపు పురుషుల కాంపాండ్‌ టీమ్‌ కాంస్య పతక పోరులో ప్రియాన్ష్, ప్రథమేశ్, అభిషేక్‌ శర్మతో కూడిన భారత్‌ 233-233 (30-30) షూటాఫ్‌లో ఆస్ట్రేలియా చేతిలో కంగుతింది. ప్రపంచ నంబర్‌వన్‌ భారత్‌ తనకంటే తక్కువ ర్యాంకు (21)లో ఉన్న ఆసీస్‌ ముందు తలవంచింది.

4 రౌండ్ల పోటీ ముగిసే సరికి రెండు జట్లు 233-233తో సమంగా నిలిచాయి. షూటాఫ్‌లోనూ రెండు జట్లు 30 పాయింట్ల చొప్పున సాధించాయి. కానీ ఆసీస్‌ ఆర్చర్లు విసిరిన బాణాల్లో రెండు లక్ష్యానికి అత్యంత చేరువగా ఉండటంతో భారత్‌కు పరాజయం తప్పలేదు. రికర్వ్‌ వ్యక్తిగత అర్హత రౌండ్లో పురుషుల్లో తరుణ్‌దీప్‌ రాయ్‌ (681) ఆరో, బొమ్మదేవర ధీరజ్‌ (678) 11వ స్థానాన్ని దక్కించుకున్నారు. మహిళల్లో దీపిక కుమారి (677) నాలుగో స్థానంలో నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement