Friday, May 3, 2024

T20 | ఉత్కంఠ పోరు.. డబుల్‌ సూపర్ ఓవర్​లో​ భారత్​ విజయం

అంతర్జాతీయ క్రికెట్‌ చరిత్రలో అద్భుతం. ఇంతవరకూ చూడని విధంగా ఒక టీ20 మ్యాచ్‌ ఫలితం డబుల్‌ సూపర్‌ ఓవర్‌ ద్వారా తేలింది. భారత్ , అఫ్గాన్​ మధ్య బెంగళూరు వేదికగా ఇవ్వాల (బుధవారం) రాత్రి జరిగిన ఆఖరి టీ20 అభిమానులకు అసలైన వినోదాన్ని అందించింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో.. ఇరు జట్ల స్కోర్లు ఏకంగా రెండు సార్లు సమం (212, 16) కావడంతో మ్యాచ్‌ లో విజేతను డబుల్‌ సూపర్‌ ఓవర్‌ ద్వారా నిర్ణయించారు. అత్యంత ఉత్కంఠ మధ్య ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత్‌ విజేతగా తేలింది.

మొదట భారత్‌ నిర్దేశించిన 213 పరుగుల ఛేదనలో అఫ్గాన్‌.. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఫస్ట్‌ సూపర్‌ ఓవర్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన అఫ్గాన్‌.. 16 పరుగులు చేయగా భారత్‌ అవే పరుగులు చేయడంతో సూపర్‌ ఓవర్‌ సైతం డ్రా అయింది. దీంతో మరో సూపర్‌ ఓవర్‌ నిర్వహించారు. రెండో సూపర్‌ ఓవర్‌లో భారత్‌ 11 పరుగులు చేయగా అఫ్గాన్‌.. మూడు బంతుల్లో (ఒక్క పరుగు మాత్రమే) రెండు వికెట్లు కోల్పోవడంతో టీమిండియా విజేతగా నిలిచింది.

అంతకుముందు భారత్‌ నిర్దేశించిన 213 పరుగుల ఛేదనలో అఫ్గాన్‌ బ్యాటర్లలో రెహ్మనుల్లా గుర్బాజ్‌ (32 బంతుల్లో 50, 3 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇబ్రహీం జద్రాన్‌ (41 బంతుల్లో 50, 4 ఫోర్లు, 1 సిక్సర్‌), గుల్బాదిన్‌ (23 బంతుల్లో 53 నాటౌట్‌, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మహ్మద్‌ నబీ (16 బంతుల్లో 34, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) లు రాణించారు. భారత బౌలర్లలో వాషింగ్టన్‌ సుందర్‌ ( 18/3) రాణించాడు.

ఓపెనర్లు అదుర్స్‌..
భారీ ఛేదనలో అఫ్గాన్‌కు శుభారంభమే దక్కింది. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్‌, ఇబ్రహీం జద్రాన్‌లు తొలి వికెట్‌కు 10.6 ఓవర్లలోనే 93 పరుగులు జోడించారు. బిష్ణోయ్‌, దూబేలను లక్ష్యంగా చేసుకుని భారీ షాట్లు ఆడారు. ముకేశ్‌ కుమార్‌ వేసిన మూడో ఓవర్లో గుర్బాజ్‌ 4, 6 బాదగా జద్రాన్‌.. బిష్ణోయ్‌ వేసిన నాలుగో ఓవర్లో రెండు ఫోర్లు కొట్టాడు. దూబే వేసిన పదో ఓవర్లో గుర్బాజ్‌ ఫోర్‌, సిక్సర్‌ రాబట్టాడు. కుల్దీప్‌ వేసిన 11వ ఓవర్లో మూడో బంతికి సిక్సర్‌ కొట్టిన గుర్బాజ్‌.. 29 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేశాడు. కానీ కానీ అదే ఓవర్లో ఆఖరి బంతికి వాషింగ్టన్‌ సుందర్‌ చేతికి చిక్కాడు.

- Advertisement -

సుందర్‌ సూపర్‌..

12 ఓవర్లలో 98-1గా ఉన్న అఫ్గాన్‌కు వాషింగ్టన్‌ సుందర్‌ 13 ఓవర్లో డబుల్‌ స్ట్రోక్‌ ఇచ్చాడు. ఈ ఓవర్లో నాలుగో బంతికి ఇబ్రహీం జద్రాన్‌ స్టంపౌట్‌ అవగా అజ్మతుల్లా.. రవి బిష్ణోయ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. కానీ అదే ఊపును భారత్‌ కొనసాగించలేకపోయింది. అవేశ్‌ ఖాన్‌ వేసిన 14వ ఓవర్లో గుల్బాదిన్‌.. ఒక ఫోర్‌తో పాటు రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. ఆ ఓవర్లో 20 పరుగులొచ్చాయి. కుల్దీప్‌ వేసిన మరుసటి ఓవర్లో నబీ రెండు సిక్సర్లు కొట్టాడు. బిష్ణోయ్‌ వేసిన 16వ ఓవర్లో నబీ.. 4, 4, 6 తో 17 పరుగులు రాబట్టాడు. కానీ వాషింగ్టన్‌ భారత్‌కు మరో బ్రేక్‌ ఇచ్చాడు. అతడు వేసిన 17వ ఓవర్లో రెండో బంతికి అవేశ్‌ ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

ఆఖర్లో ఉత్కంఠ..

17 ఓవర్లు ముగిసేటప్పటికీ అఫ్గాన్‌ స్కోరు.. 167-4తో విజయం దిశగా సాగింది. కానీ ఆఖర్లో ఆ జట్టు ఒత్తిడికి చిత్తైంది.??? ముకేశ్‌ వేసిన 18వ ఓవర్లో గుల్బాదిన్‌తో సమన్వయలోపం కారణంగా కరీమ్‌ జనత్‌ (2) రనౌట్‌ అయ్యాడు. ఆఖరి రెండు బంతుల్లో గుల్బాదిన్‌ రెండు ఫోర్లు సాధించాడు. అవేశ్‌ ఖాన్‌ వేసిన 19వ ఓవర్లో నజీబుల్లా జద్రాన్‌ ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లీ అద్భుతంగా అందుకున్నాడు. అవేశ్‌ ఆ ఓవర్లో 17 పరుగులిచ్చాడు.

ఆఖరి ఓవర్లో 19 పరుగులు కావాల్సి ఉండగా.. ముకేశ్‌ కుమార్‌ వైడ్లతో పాటు భారీగా పరుగులిచ్చి మ్యాచ్‌ను భారత చేతుల్లోంచి చేజార్చాడు. తొలి నాలుగు బంతుల్లోనే 14 పరుగులు సమర్పించుకున్న అతడు.. చివరి రెండు బంతుల్లో నాలుగు పరుగులిచ్చాడు. దీంతో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది.

సూపర్‌ ఓవర్‌ సాగిందిలా..

అఫ్గాన్‌ తరఫున గుల్బాదిన్‌, గుర్బాజ్‌లు బ్యాటింగ్‌కు రాగా తొలి బంతికి గుల్బాదిన్‌ రెండో పరుగు కోసం యత్నించి రనౌట్‌ అయ్యాడు. రెండో బంతికి ఒక్క పరుగే వచ్చింది. మూడో బాల్‌ ఫోర్‌ కాగా నాలుగో బంతికి సింగిల్‌ మాత్రమే వచ్చింది. ఐదో బంతిని నబీ సిక్సర్‌గా మలిచాడు. ఆరో బంతికి మూడు పరుగులొచ్చాయి. దీంతో ఆ జట్టు 16 పరుగులు చేసింది. భారత జట్టు తరఫున జైస్వాల్‌, రోహిత్‌లు బ్యాటింగ్‌కు వచ్చారు. రోహిత్‌ రెండు సిక్సర్లు బాదినా టీమిండియా స్కోరు 16 పరుగుల వద్దే ఆగింది. దీంతో మరో సూపర్‌ ఓవర్‌ అనివార్యమైంది.

రెండో సూపర్‌ ఓవర్‌లో తొలి బంతికి రోహిత్‌.. తొలి బంతికి సిక్సర్‌, రెండో బంతిని ఫోర్‌గా మలిచాడు. మూడో బంతికి సింగిల్‌ రాగా.. తర్వాతి రెండు బంతుల్లో రెండు వికెట్లను కోల్పోయింది. అఫ్గానిస్తాన్‌ విజయలక్ష్యం 12 పరుగులు కాగా.. రోహిత్‌, స్పిన్నర్‌ బిష్ణోయ్‌ చేతికి బంతినిచ్చాడు. బిష్ణోయ్‌.. తొలి బంతిని నబీని, మూడో బంతికి గుర్బాజ్‌ను ఔట్‌ చేయడంతో భారత సంచలన విజయం సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement