Saturday, May 18, 2024

Crick Buz: కివీస్‌పై భారీ విజ‌యం.. ఇండియా నెంబ‌ర్ వ‌న్‌.. టెస్ట్ ర్యాంకింగ్స్‌లో సూప‌ర్‌

ఐసీసీ మెన్స్ టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఫ‌స్ట్ నిలిచింది. న్యూజిలాండ్‌తో జ‌రిగిన సిరీస్‌ను 1-0 తేడాతో కైవ‌సం చేసుకున్న కోహ్లీసేన‌.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తొలి స్థానాన్ని సొంతం చేసుకున్న‌ది. తాజా సిరీస్ విక్ట‌రీతో రేటింగ్‌లో ఇండియా 124 పాయింట్లు సాధించ‌గా.. రెండో స్థానంలో 121 పాయింట్లతో న్యూజిలాండ్ ఉంది. నిజానికి ఈమ‌ధ్య‌ ముగిసిన వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌లోనూ ఈ రెండు జ‌ట్లే ఫైన‌ల్లో త‌ల‌ప‌డిన విష‌యం తెలిసిందే.

అయితే టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో ఓడిన ఇండియా.. తాజాగా కివీస్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌ను చేజిక్కించుకున్న‌ది. దీంతో మ‌ళ్లీ ఇండియా ర్యాంకింగ్ మెరుగైంది. ఆ త‌ర్వాత ర్యాంకుల్లో ఆస్ట్రేలియా(108), ఇంగ్లండ్‌(107), పాకిస్థాన్‌(92) జ‌ట్లు ఉన్నాయి. ఇక 2021-2023 టెస్ట్ చాంపియ‌న్‌షిప్ పాయింట్ల ప‌ట్టిక‌లో ఇండియా 42 పాయింట్లు సాధించింది. ఇండియన్‌ టీమ్ స్వంత గ‌డ్డ‌పై టెస్ట్ సిరీస్‌ను గెల‌వ‌డం వ‌రుస‌గా ఇది 14వ సారి కావ‌డం విశేషం.

న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న టెస్ట్ సిరీస్‌లో రెండో టెస్టులో భారత్ భారీ విజ‌యం సొంతం చేసుకుంది. 167 ప‌రుగుల‌కే కివీస్‌ను కుప్ప‌కూల్చింది. మయాంక్‌ (62) మరోసారి అర్ధశతకంతో మెరవగా, పుజారా (47), గిల్‌ (47), కోహ్లీ (36) ఆకట్టుకోగా అక్షర్‌ 41పరుగులుతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌తో కలిపి 540పరుగులు భారీ లక్ష్యాన్ని కివీస్‌కు నిర్దేశించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన న్యూజిలాండ్ నాలుగో రోజు ఆట ప్రారంభ‌మైన కొద్ది సేప‌టికే (ఉద‌యం 11 గంట‌ల‌కు) తోక ముడిచింది. భారత బౌలర్ల ధాటికి నాలుగోరోజే కివీస్‌ కుప్పకూల‌డంతో మ్యాచ్‌తోపాటు సిరీస్‌ను కోహ్లీసేన కైవసం చేసుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement