Friday, May 3, 2024

Sports | ఆస్ట్రిలియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌.. క్వార్టర్స్‌లో సింధు, ప్రణయ్‌, శ్రీకాంత్‌

ఆస్ట్రేలియా ఓపెన్‌ బీడబ్ల్యూఎఫ్‌ సూపర్‌-500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత షట్లర్ల జోరు కొనసాగుతోంది. భారత స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, హెచ్‌ఎస్‌. ప్రణయ్‌, కిదాంబీ శ్రీకాంత్‌లు క్వార్టర్‌ ఫైనల్లో దూసుకెళ్లారు. మరోవైపు మహిళల డబుల్స్‌లో త్రిశ-గాయిత్రి గోపిచంద్‌ జోడీ ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. గురువారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రీ క్వార్టర్‌ మ్యాచ్‌లో ఒలింపిక్స్‌ డబుల్‌ మెడలిస్ట్‌, ఐదవ సీడ్‌ పీవీ సింధు 21-14, 21-10తో భారత్‌కే చెందిన ఆకర్షి కశ్యప్‌ను వరుస గేముల్లో ఓడించింది. గత కొన్ని టోర్నీల నుంచి పేలవమైన ప్రదర్శన చేస్తున్న సింధు ఈ సారి ఆస్ట్రేలియా ఓపెన్‌లో మంచి ఆరంభాన్నిచ్చింది.

భారత ప్రత్యర్థిని 38 నిమిషాల్లోనే ఓడించి తన జోరును ప్రదర్శించింది. అంతకుముందు సింధు తాను ఆడిన చివరి మూడు టోర్నీల్లో తొలి రౌండ్‌ను దాటలేక పోయింది. మరోవైపు ఈ ఏడాది 13 బీడబ్ల్యూఎఫ్‌ టోర్నీల్లో పాల్గొన్న ఈమే ఏడింటిలో తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. ఇప్పుడు తాజాగా క్వార్టర్‌ ఫైనల్లో ప్రవేశించడంతో సింధు తిరిగి గాడిలో పడిందని అర్ధమవుతోంది. ఇక్కడ జరిగిన రెండో రౌండ్‌ మ్యాచ్‌లో సింధు ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఆకర్షిపై వరుస దాడులతో ఇక్కిరిబిక్కిరి చేసింది.

ఫలితంగా ఆకర్షి తొలి సెట్‌ను 14-21 తేడాతో ఓడిపోయింది. రెండో గేమ్‌లో మరింతగా చెలరేగిపోయిన సింధు తన ప్రత్యర్థికి తన వశ్వరూపాన్ని చూపించింది. దీంతో సింధు 21-10 తేడాతో రెండో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా కైవసం చేసుకుంది. ఇక శుక్రవారం జరిగే క్వార్టర్‌ ఫైనల్లో సింధు అమెరికాకు చెందిన నాలుగో సీడ్‌ బీవెన్‌ జాంగ్‌తో తలపడనుంది. పురుషుల సింగిల్స్‌ మ్యాచుల్లో కిదాంబీ శ్రీకాంత్‌ 21-10, 21-17తో సూ లీ యాంగ్‌ (చైనీస్‌ తైపీ)ని వరుసు గేముల్లో చిత్తు చేసి క్వార్టర్‌ ఫైనల్లో దూసుకెళ్లాడు. ఆరంభం నుంచే చెలరేగి ఆడిన శ్రీకాంత్‌ తిరిగి తన పాతా ఫామ్‌ను కనబర్చాడు.

వరుస స్మాష్‌లతో చైనీస్‌ ఆటగాడికి చూక్కలు చూపెడుతూ తొలి గేమ్‌ను 21-10 భారీ తేడాతో గెలుచుకున్నాడు. ఇక రెండో గేమ్‌లో పుంజుకున్న ప్రత్యర్థి శ్రీకాంత్‌కు గట్టి పోటీ ఇచ్చాడు. దీంతో ఈ గేమ్‌ నువ్వా-నేనా అన్నట్లు సాగింది. అయితే చివర్లో తేరుకున్న భారత స్టార్‌ ప్రత్యర్థిపై ఎదురుదాడికి దిగాడు. దీంతో ఈ గేమ్‌ (21-17) శ్రీకాంత్‌ పక్షాణ నిలిచింది. ఇక తన క్వార్టర్‌ పోరులో కిదాంబీ భారత్‌కే చెందిన ప్రియాన్షు రాజవత్‌తో తలపడనున్నాడు. ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్‌ మరో మ్యాచ్‌లో యువ షట్లర్‌ ప్రియాన్షు రాజవత్‌ 21-8. 13-21, 21-19తో చైనీస్‌ తైపీకు చెందిన వాంగ్‌ జు వాయ్‌పై విజయం సాధించి ముందంజ వేశాడు. తొలి గేమ్‌ను సులభంగా గెలుచుకున్న ప్రయాన్షు రెండో రౌండ్‌లో మాత్రం పట్టును కోల్పోయాడు. ఫలితంగా రెండో గేమ్‌ ప్రత్యర్థికి కోల్పోయాడు. ఇక నిర్ణయాత్మకమైన చివరి గేమ్‌లో మాత్రం అద్భుత అటను కనబర్చి ఈ గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా కైవసం చేసుకోని క్వార్టర్స్‌లో ప్రవేశించాడు.

- Advertisement -

ప్రణయ్‌ కష్టంగా..
ఇంకో మ్యాచ్‌లో భారత స్టార్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ తన రెండో రౌండ్‌ను కష్టంగా గెలిచి క్వార్టర్‌ ఫైనల్లో అడుగుపెట్టాడు. చైనీస్‌ థైపీకి చెందిన యు జెన్‌ చీను 21-19, 19-21, 21-13తో ఓడించి టోర్నీలో ముందంజ వేశాడు. మ్యాచ్‌లో తొలి రెండు గేమ్‌లు హోరాహోరీగా జరిగాయి. నువ్వా-నేనా.. అన్నట్లు సాగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను ప్రణయ్‌ గెలుచుకోగా.. రెండో గేమ్‌ను యు జెన్‌ దక్కించుకోని మ్యాచ్‌ను 1-1తో సమం చేశాడు. ఇక మ్యాచ్‌ విజేతను తేల్చే చివరి గేమ్‌లో మాత్రం ఆరో సీడ్‌ ప్రణయ్‌ జోరును పెంచి 21-13తో ప్రత్యర్థిను చిత్తు చేశాడు. దీంతో ఈ మ్యాచ్‌ ప్రణయ్‌ వశమైంది. హోరాహోరిగా సాగిన ఈ మ్యాచ్‌ 1గంట 14 నిమిషాలు జరిగింది. ప్రణయ్‌ తన తర్వాతి పోరులో ఇండోనేషియాకు చెందిన టాప్‌సీడ్‌ ఆంటోని సినీసుక గింటింగ్‌తో ఢీ కొననున్నాడు.

గాయిత్రి-త్రిష జోడీ ఓటమి..
భారత స్టార్‌ మహిళల డబుల్స్‌ జోడీ గాయిత్రి గోపీచంద్‌- త్రిష జాలీ పోరాటం ప్రీ క్వార్టర్స్‌లోనే ముగిసింది. గురువారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో గాయిత్రి-త్రిష ద్వయం 10-21, 20-22తో జపాన్‌ జోడీ మయు మట్స్‌మోటో-వాకనా నాగార చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌లో మిథున్‌ మంజునాథ్‌ కూడా ఓటమిని ఎదుర్కొన్నాడు. ప్రీ క్వార్టర్స్‌లో మంజునాథ్‌ 13-21, 21-12, 19-21తో జీ జీయ లీ (మలేసియా) చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి వైదొలిగాడు. తొలి మ్యాచ్‌లో నాలుగో సీడ్‌ సింగాపూర్‌ ఆటగాడిపై సంచలన విజయాన్ని నమోదు చేసిన మంజునాథ్‌ రెండో మ్యాచ్‌లో మాత్రం గట్టిగా పోరాడినా ముందంజ వేయలేక పోయాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement