Thursday, May 2, 2024

కివీస్‌పై ఆసీస్‌ విజయం, అలెక్స్‌క్యారీ, కెమెరూన్‌ గ్రీన్‌ విజృంభణ

కివీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. మూడు వన్డేల టోర్నీలో భాగంగా మంగళవారం ఇరుజట్లు మొదటి మ్యాచ్‌లో తలపడ్డాయి. కెయిన్స్‌వేదికగా జరిగిన ఈ ఉత్కంఠ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆసీస్‌ లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లు అలెక్స్‌ క్యారీ (99 బంతుల్లో 85), కెమరూన్‌ గ్రీన్‌ (92 బంతుల్లో 89) రాణించడం ద్వారా కివీస్‌పై చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేశారు. గ్రీన్‌ చివరి నిముషం వరకు క్రీజ్‌లో నిలబడి, మరో 30 బంతులు మిగిలివుండగానే, ఆసీస్‌ను విజయ తీరాలకు చేర్చాడు. దాంతో సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఆస్ట్రేలియా దూసుకెళ్లింది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి ఆసీస్‌ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. డెవాన్‌ కాన్వే (68 బంతుల్లో 46), కెప్టెన్‌ విలియమ్సన్‌ (71 బంతుల్లో 45), వికెట్‌కీపర్‌ టామ్‌ లాథమ్‌ (57 బంతుల్లో 43) రాణించారు. ఆసీస్‌ బౌలర్లలో మ్యాక్స్‌వెల్‌ 4, హెజిల్‌వుడ్‌ 3, స్టార్క్‌, జంపా తలో వికెట్‌ పడగొట్టారు. అనంతరం 233 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్‌ ఆరంభంలోనే తడబడింది. కివీస్‌ బౌలర్ల ధాటికి విలవిలలాడింది. 44 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే, అలెక్స్‌ క్యారీ, కెమరూన్‌ గ్రీన్‌ అద్భుతమైన పోరాటపటిమతో మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేశారు. ఆసీస్‌ను ఓటమి నుంచి గెలుపు తీరాలకు చేర్చారు. గ్రీన్‌ తొమ్మిదో వికెట్‌కు ఆడమ్‌ జంపాతో (13 నాటౌట్‌) కలిసి 26 పరుగులు జోడించి జట్టు విజయానికి దారులు వేశాడు. ఇన్నింగ్స్‌ ఆరంభంలో ట్రెంట్‌ బౌల్ట్‌ (4/40), మ్యాట్ హెన్రీ (2/50)లు ఆసీస్‌ను వణికించారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఇదే వేదికగా సెప్టెంబర్‌ 8న జరుగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement