Monday, April 29, 2024

Delhi | మోడీ చేతిలో వైఎస్సార్సీపీ కీలుబొమ్మ : సీపీఐ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నడచుకుంటోందని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్కిస్ట్) – సీపీఐ(ఎం) ఆరోపించింది. శనివారం మధ్యాహ్నం ఢిల్లీలోని పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయం హరికిషన్ సింగ్ సూర్జిత్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస రావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ధ్వజమెత్తారు.

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు బీజేపీకి తెలిసే జరిగిందని ఆరోపించారు. బీజేపీ చేతిలో వైఎస్సార్సీపీ కీలుబొమ్మలా మారిందని, కేంద్రం చెప్పినట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు రూపొందిస్తోందని విమర్శించారు. అన్ని విషయాల్లో బీజేపీని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో హక్కులను వైఎస్సార్సీపీ హరిస్తోందని దుయ్యబట్టారు.

తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడతారా లేక బీజేపీ ముందు మోకరిల్లుతారా అన్నది తేల్చుకోవాలని వైఎస్సార్సీపీకి శ్రీనివాసరావు అల్టిమేటం ఇచ్చారు. రెండు పార్టీలూ కలిసి రాష్ట్రాన్ని సమస్యల సుడిగుండంలోకి నెట్టేశాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధాన అజెండాగా సీపీఐ(ఎం) ప్రజారక్షణ భేరీ యాత్ర చేపట్టనుందని శ్రీనివాసరావు ప్రకటించారు.

- Advertisement -

అక్టోబర్ 30న రాష్ట్రంలో మూడు దిక్కుల నుంచి ఈ యాత్రను ప్రారంభిస్తామని తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోని, శ్రీకాకుళం జిల్లా మందస, పార్వతీపురం జిల్లా సీతంపేట నుంచి విజయవాడ వరకు బస్సుయాత్ర చేపట్టనున్నట్టు వెల్లడించారు. నవంబర్ 15న విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని అన్నారు. వామపక్ష పార్టీలతో కలిసి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు.

పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో ఎందుకున్నారు?

పదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న ఒక్క సమస్యను కూడా కేంద్ర ప్రభుత్వం పరిష్కరించలేదని, ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ, కడప ఉక్కు పరిశ్రమల అంశాలను పట్టించుకోలేదని శ్రీనివాస రావు ఆరోపించారు. అయినా సరే పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో ఎందుకున్నారో చెప్పాలని నిలదీశారు. 2019 ఎన్నికల సమయంలో పాచిపోయిన లడ్డూ అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టిపోసిన పవన్, అదే ఎన్డీఏతో ఇప్పటికీ ఎందుకున్నారో చెప్పాలని అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement