Friday, May 17, 2024

మత్తుకు చిత్తు, హష్‌ ఆయిల్‌కు నగర యువత బానిస.. ఉత్తరాంధ్ర టూ హైదరాబాద్‌

ప్రభన్యూస్‌, హైదరాబాద్‌ ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర నుంచి హైద‌రాబాద్ నగరానికి అక్రమ రవాణా అవుతున్న హషీశ్‌ ఆయిల్‌ మత్తుకు యువత బానిసలుగా మారుతోంది. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు, యువతరాన్ని టార్గెట్‌ చేస్తూ చాప కింద నీరులా గుట్టుచప్పుడు కాకుండా అమ్మకాలు సాగుతున్నాయి. గంజాయి రవాణా పెద్ద ప్రహాసనం కావడంతో, అందులోంచి తీసిన హషీశ్‌ అయిల్‌నే ఎవరికీ అనుమానం రాకుండా లగేజీ బ్యాగులు, బ్రీఫ్‌కేసుల్లో మాదకద్రవ్యాల వ్యాపారులు నగరానికి రవాణా చేస్తున్నారు. హషిశ్‌ ఆయిల్‌లో ఐసో ప్రొపైల్‌ ఆల్కహాల్‌ను కలిపి 5 ఎంఎల్‌, 10 ఎంఎల్‌ పాకెట్లుగా చేసి డిమాండ్‌ను బట్టి ఒక్కొక్కటి రూ.1000 నుంచి రూ.2000 వరకు అమ్ముతున్నారు. కొంతమంది డైరెక్ట్‌గా వాడితే మరికొంత సిగరెట్లు, పెన్‌ వ్యాపోరైజర్లలో కలిపి వాడుతున్నారు. దీన్ని సమయానికి వేసుకోకపోతే మానసికంగా, శారీరంగా ఇబ్బందులు పడతారు. చాలామంది యువకులు దీనికి అలవాటు పడి డబ్బులు లేక తామే స్వయంగా అమ్మకాలు సాగించే స్థాయికి దిగజారుతున్నారు. చూడ్డానికి ఇది బంగారు, బ్రౌన్‌, బ్లాక్‌ కలర్లలో ఉంటుంది. మన దేశంలో దీని వాడకం ఇప్పటి వరకు పెద్దగా లేదు. అయితే గత రెండేళ్లుగా హైదరాబాద్‌ నగరాన్ని ఈ మత్తు మందు పట్టి పీడిస్తోంది. గడిచిన ఏడాదిగ్రేటర్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో వందకు పైగా కేసులు నమోదు చేసి, అక్రమ రవాణాకు పాల్పడుతున్న మాదక ద్రవ్యాల వ్యాపారులను అరెస్టు చేసి, కోట్లాది రూపాయల హషీశ్‌ ఆయిల్‌ను పట్టుకున్నారు. అయినా నగరంలో ఈ దందా ఆగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఉత్తరాంధ్ర నుంచి రవాణా..

ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం నుంచి నగరానికి హషీశ్‌ ఆయిల్‌ అక్రమ రవాణా అవుతోంది. గుంటూరు, విజయవాడల మీదుగా గుట్టుచప్పుడు కాకుండా నగరానికి రవాణా చేస్తున్నారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో విపరీతంగా గంజాయి సాగవుతుంది. గంజాయి ఇక్కడి నుంచి హైదరాబాద్‌ నగరంతో పాటు వివిధ రాష్ట్రాలకు సరఫరా అవుతోంది. అయితే గంజాయి రవాణా శ్రమతో కూడుకున్నందున, సులువుగా తరలించే వీలున్న హషీశ్‌ ఆయిల్‌ వైపు డ్రగ్‌ వ్యాపారులు మొగ్గు చూపుతున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు మరింత నిఘా పెట్టి, వీరిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని నగర వాసులు కోరతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement