Saturday, May 18, 2024

కిషన్‌రెడ్డిని కలిసిన వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి… ప్రధాని పర్యటన ఏర్పాట్లపై చర్చ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం వైఎస్సార్సీపీ లోక్‌సభా పక్ష నేత మిథున్ రెడ్డి ఆయనను కలిశారు. భీమవరంలో ప్రధాని పర్యటన ఏర్పాట్లపై కిషన్‌రెడ్డితో చర్చించారు. ప్రధాని 2,3,4వ తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తారని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కిషన్‌రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లో 2,3 తేదీల్లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ నమావేశాల్లో పాల్గొంటారని తెలిపారు. జూలై 4న మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి వేడుకల్లో భాగంగా భీమవరం బహిరంగ సభలో పాల్గొంటారని అన్నారు. అల్లూరి సీతారామరాజు నివాసం, ఆయన సంచరించిన ప్రాంతాలు, సమాధి సహా అన్నింటినీ ఆధునికీకరిస్తామని వివరించారు. ఏడాది పాటు అల్లూరి సీతారామరాజును స్మరించుకుంటూ కార్యక్రమాలు జరుగుతాయని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఏడాది కాలంలో అల్లూరి మ్యూజియం ఏర్పాటవుతుందని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు మంజూరు చేసిందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వమే అల్లూరి మ్యూజియంను నిర్మిస్తుందని ఆయన పేర్కొన్నారు. 

పార్లమెంట్‌లో విగ్రహాలుండవు

అనంతరం కిషన్‌రెడ్డి కొత్త పార్లమెంట్ నిర్మాణంపై స్పందించారు. నూతన పార్లమెంట్ భవనంలో ఏ నాయకుడి విగ్రహమూ ఉండదని స్పష్టం చేశారు. పాత పార్లమెంట్‌ను మ్యూజియంగా మార్చాలని భావిస్తున్నట్టు వెల్లడించారు. భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా నూతన పార్లమెంట్‌లో చిత్రపటాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నామన్నారు. వచ్చే జనవరిలో బడ్జెట్ సమావేశాలు నూతన భవనంలో జరుగుతాయని, ప్రస్తుత వర్షాకాల, శీతాకాల సమావేశాలు మాత్రమే పాత పార్లమెంట్‌లో నిర్వహిస్తారని కిషన్‌రెడ్డి చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement