Friday, May 17, 2024

Delhi | ఛాన్స్​ దక్కెది ఎవరికో?.. హస్తినకు బీజేపీ మూడో లిస్ట్​​

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తదుపరి జాబితా విడుదల చేసేందుకు సమాయత్తమవుతోంది. అభ్యర్థుల ఎంపికపై రాష్ట్ర స్థాయిలో చేసిన కసరత్తుకు హస్తినలో ఆమోదముద్ర పడాల్సి ఉంది. ఈ క్రమంలో బుధవారం పార్టీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా నేతృత్వంలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) సమావేశమై జాబితాను ఖరారు చేయనుంది. ఈ భేటీకి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, డా. కే. లక్ష్మణ్ సహా కమిటీలో ఉన్న ఇతర సభ్యులు హాజరుకానున్నారు.

ఢిల్లీలోని ఇండియా‌గేట్ సమీపంలో కర్తవ్యపథ్ వద్ద కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరగనున్న “మేరీ మాటీ – మేరా దేశ్” కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర సాంస్కృతిక మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం వరకు ఢిల్లీ చేరుకోనున్నారు. బుధవారం సాయంత్రం సీఈసీ భేటీ జరిగేలోగా అధిష్టానం పెద్దలతో టికెట్ల వ్యవహారం, పార్టీలో చేరికలు, పార్టీని వీడి వెళ్తున్న నేతలు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

- Advertisement -

మూడో జాబితాలో ఎవరెవరు?

తొలి జాబితాలో 52 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ, ఒకే పేరుతో రెండో జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు 3వ జాబితా కోసం రాష్ట్రస్థాయిలో కసరత్తు పూర్తయింది. ఇందులో ప్రధానంగా కిషన్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న సికింద్రబాద్ పార్లమెంట్ పరిధిలో ఎవరిని ఎక్కడ నుంచి బరిలోకి దింపాలనే అంశం పైన చర్చించినట్టు తెలిసింది. పార్టీకి పట్టు ఉన్న గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని నియోజకవర్గాలపై కమలదళం ప్రత్యేక దృష్టి పెట్టింది.

వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో బీజేపీ గెలుపొందేలా బలమైన అభ్యర్థుల ఎంపిక కోసం నేతలు తీవ్రంగా కసరత్తు చేశారు. ఈ క్రమంలో సనత్ నగర్ నుంచి మర్రి శశిధర్ రెడ్డి, జూబ్లీహిల్స్ నుంచి విక్రమ్ గౌడ్, ముషీరాబాద్ నుంచి గోపాల్ రెడ్డి లేదా బండారు విజయలక్ష్మికి టికెట్ ఇచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఎల్బీ నగర్ నుంచి సామ రంగారెడ్డి, వంగా మధుసూధన్ రెడ్డి, గంగిడి మనోహర్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. అంబర్‌పేట నుంచి బండారు విజయలక్ష్మి లేదా గౌతమ్ రావు పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

సికింద్రాబాద్ నుంచి బండ కార్తీకరెడ్డి, మల్కాజ్ గిరి నుంచి ఆకుల రాజేందర్, రాజేంద్రనగర్ నుంచి తోకల శ్రీనివాస్ రెడ్డి పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఉప్పల్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తో పాటుగా వీరేందర్ గౌడ్ కూడా సీటు ఆశిస్తున్నారు. మేడ్చల్ నుంచి విక్రమ్ రెడ్డి టికెట్ రేసులో ఉన్నారు. పార్టీ అంతర్గతంగా జరిపిన సర్వేలు, అభ్యర్థుల సామాజిక నేపథ్యం, ప్రజల్లో ఉన్న పలుకుబడి, ఆదరణ వంటి అంశాలను బేరీజు వేసుకుంటూ జాబితా రూపొందిస్తున్నట్టు తెలిసింది.

ఇతర పార్టీల రెబెల్స్‌పై కన్ను

టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి తమ సత్తా చాటేందుకు చాలా చోట్ల సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో రెబెల్స్ గోల ఎక్కువగా ఉంది. అలాంటివారిలో సొంత బలం కలిగిన నేతలకు సామాజిక, ఆర్థిక బలాబలాలను బేరీజు వేసుకుని వారికి టికెట్ ఇవ్వాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలిసింది.

స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం కంటే బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తే ఆ తిరుగుబాటు నేతలు సైతం తమ విజయావకాశాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు. అయితే తీరా గెలిచిన తర్వాత పార్టీకి నమ్మకంగా ఉంటారా లేదా అన్న విషయంపై అనుమానాలున్నాయి. ఏదెలా ఉన్నా.. కమలనాథులు తెలంగాణలో తమ స్కోరు పెంచుకోవాలని, ఒకవేళ ఏ పార్టీకీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీ రానిపక్షంలో తాము సాధించే సీట్లే కీలకంగా మారతాయని భావిస్తున్నారు.

ఆ పార్టీ సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ స్వయంగా ఈ మాటను పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో అన్నారు. తెలంగాణలో వచ్చేది హంగ్ ఫలితాలేనని, కానీ బీజేపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆ ధీమాను నిజం చేయాలంటే వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పార్టీ గెలుపొందాల్సి ఉంటుంది.

అందుకే సమాజంలో సగం కంటే ఎక్కువగా ఉన్న బీసీ ఓటర్లను ఆకట్టుకోడానికి బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని బీజేపీ అందుకుంది. అదే సమయంలో బీసీ రిజర్వేషన్లకు కోత పెట్టి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నారని, తాము అధికారంలోకి వస్తే తక్షణమే ముస్లిం రిజర్వేషన్లను తొలగించి బీసీలకు లబ్ది జరిగేలా చేస్తామని కిషన్ రెడ్డి ప్రకటించారు.

ప్రచారంతో పాటు అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ బీసీలు, మహిళలకు అధిక ప్రాధాన్యతనిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 3న నోటిఫికేషన్ జారీకానున్న నేపథ్యంలో.. ఈలోగా సుమారు 40 మందితో మూడవ జాబితాను సిద్ధం చేయాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి తేదీ అయిన నవంబర్ 10లోగా మిగతా స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేయనుంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement