Monday, May 6, 2024

తగ్గేదేలే, కాస్ట్లీ అయినా స‌రే పెద్ద కారే కావాలే.. మారుతున్న కస్టమర్ల అభిరుచి

దేశంలో ఇప్పుడు ఎస్‌యూవీ కార్ల హవా నడుస్తోంది. గతంలో కస్టమర్లు చిన్న కార్లంటే మనసు పారేసుకునేవారు… క్రమంగా హ్యాచ్‌బ్యాక్‌ కార్లపై మోజు పెంచుకున్నారు. హ్యాచ్‌బ్యాక్‌ కార్లలో పడవలాంటి పెద్ద కార్లు వచ్చాయి. ఇప్పుడు దేశంలో స్పోర్ట్స్‌ యూటిలిటీ(ఎస్‌యూవీ) వాహనాల క్రేజ్‌ పీక్స్‌లో ఉంది. ఖరీదు ఎక్కువైనా తగ్గేదేలే అంటున్నారు కస్టమర్లు. ముఖ్యంగా యువ కస్టమర్ల టేస్ట్‌ వేరుగా ఉంటోందని ఈ రంగంలో నిపుణులు అంటున్నారు. అందుకే పోటీ పడి మరీ కంపెనీలు కొత్త కొత్త మోడళ్లను మార్కెట్‌లో విడుదల చేస్తున్నాయి. ఈ మోడళ్లలో వస్తున్న ఫీచర్లు యువ కస్టమర్లను బాగా ఆకర్షిస్తున్నాయి.

మార్కెట్‌లో ఎస్‌యూవీలకు క్రేజ్‌
వీటికి డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం వివిధ కంపెనీలకు చెందిన 36 మోడళ్లు మార్కెట్‌లో లభిస్తున్నాయి. డిమాండ్‌ ఎక్కువ ఉన్న మోడళ్లను బుక్‌ చేసుకున్న రెండు సంవత్సరాల తరువాతనే డెలివరీ ఇస్తున్నారు. ఇంత వెయిటింగ్‌ ఉన్నా బుకింగ్స్‌ మాత్రం తగ్గడంలేదు. ప్రధానంగా ఎంట్రీ లెవల్‌, మిడ్‌ సైజ్‌ ఎస్‌యూవీలుకు అధిక డిమాండ్‌ ఉంది.

ఆధునిక టెక్నాలజీ
కస్టమర్ల అభిరుచులు మారుతున్నాయి. ఖరీదు ఎక్కువైనా అన్ని హంగులు ఉండాలని కోరుకుంటున్నారు. హై ఎండ్‌ మోడల్స్‌ అంటేనే ఎక్కువ ఇష్టపడుతున్నారు. సన్‌ రూఫ్‌, యాప్‌ కనెక్టివిటీ, వాయిస్‌ కమాండ్‌, అలెక్సా తరహా టెక్నాలజీ ఇలా అనేక ఆధునిక ఫీచర్లతో ఈ కార్లు లభిస్తున్నాయి.
వీటికి ఉన్న డిమాండ్‌తో కంపెనీలు కూడా పోటీ పడి పలు రకాల ఆధునిక ఫీచర్లతో మార్కెట్‌లో విడుదల చేస్తున్నారు. క్రమంగా హ్యాచ్‌బ్యాక్‌ కార్ల స్థానంలో ఎస్‌యూవీలు మార్కెట్‌ను ఆక్రమిస్తున్నాయి.

40 శాతం ఎస్‌యూవీలే…
మార్కెట్‌లో 19 శాతంగా ఉన్న ఎస్‌యూవీల అమ్మకాలు 2021-22 నాటికి 40 శాతానికి పెరిగాయని మారుతి సుజుకీ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ శశాంక్‌ శ్రీవాత్సవా చెప్పారు. ఈ కార్లు ఎత్తుగా ఉండి, రోడ్‌ క్లీయర్‌గా కనిపిస్తుండం వల్ల కూడా కస్టమర్లు ఎక్కువగా ఎస్‌యూవీలను కొనేందుకు ఇష్టపడుతున్నారని ఆయన చెప్పారు. 2011 వరకు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ కార్లు మార్కెట్‌ను ఏలాయి. వీటికి అత్యధిక డిమాండ్‌ ఉండేది. ఇప్పుడు ఎంట్రీలెవల్‌, మిడ్‌ సెగ్మెంట్‌లో వస్తున్న ఎస్‌యూవీలు అత్యధికంగా అమ్మకాలు జరుగుతున్నాయని ఆయన విశ్లేషించారు. గత సంత్సరం మొత్తం 30.68 లక్షల కార్ల అమ్మకాలు జరిగితే అందులో ఎస్‌యూవీలు 6.52 లక్షల అమ్మకాలు జరిగాయి. గత ఐదు సంవత్సరాల్లో కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన కార్లలో ఎక్కువ శాతం ఎస్‌యూవీలే ఉన్నాయి.

హై ఎండ్‌ కార్లకు డిమాండ్‌
ఎస్‌యూవీల్లోనూ యువతరం ఎక్కువ ఆధునిక ఫీచర్లు ఉండే హై ఎండ్‌ మోడళ్ల కార్లనే ఇష్టపడుతున్నారని శ్రీవాత్సవా చెప్పారు. 2016-17 సంవవత్సరంలో హై ఎండ్‌ కార్ల అమ్మకాలు 17 శాతం ఉంటే, 2021-22 సంవత్సరంలో ఇది 24 శాతానికి పెరిగిందని చెప్పారు. మారుతి సుజుకీకి చెందిన బ్రిజా కారు అమ్మకాల్లో హైఎండ్‌ మోడల్‌ బుకింగ్స్‌ 70 శాతం ఉన్నాయని వివరించారు. నచ్చిన, కోరుకున్న ఆధునిక టెక్నాలజీతో కూడి ఫీచర్లు ఉంటే ధర ఎక్కవగా ఉన్నా కొనేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు.

- Advertisement -

కరోనాతో పెరిగిన సొంతకార్లు
కరోనా వల్ల వినియోగదారుల వైఖరిలో చాలా మార్పులు వచ్చాయి. భద్రతకు అధిక ప్రాధ్యాన్యత ఇస్తున్నారు. పబ్లిక్‌ ట్రాన్స్‌ఫోర్ట్‌ బదులు సొంత కారు ఉండాలని కోరుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ డివిజన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శైలేష్‌ చంద్ర అభిప్రాయపడ్డారు. కస్టమర్లు ప్రధానంగా కారు డిజైన్‌, ఉన్న ఆధునిక ఫీచర్లు, భద్రత పరమైన అంశాలు ఇలా పలు అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన అభిప్రాయడ్డారు. టాటా మోటర్స్‌ 2021లో సరికొత్త మోడల్స్‌ను మార్కెట్‌లో విడుదల చేయడంతో కస్టమర్లను ఆకట్టుకుందని శైలేష్‌ చంద్ర చెప్పారు. దీని వల్ల అమ్మకాల్లో కంపెనీ మూడో స్థానానికి చేరుకుందన్నారు. హై ఎండ్‌ కార్ల విషయంలో కస్టమర్ల అభిరుచులు మారిపోతున్నాయని దీనికి అనుగుణంగా వస్తున్న మోడళ్లకు ఎక్కువ ఆధరణ లభిస్తుందని కియా ఇండియా చీఫ్‌ సేల్స్‌ ఆఫీసర్‌ మైయాంగ్‌ సిక్‌ షోన్‌ అభిప్రాయపడ్డారు. కియా ఐదు నెలల క్రితమే లాంచ్‌ చేసిన కార్నెస్‌ మోడల్‌ ఎస్‌యూవీ 30 వేల యూనిట్ల అమ్మకాలు జరిగాయని తెలిపారు. మొత్తం కియా కంపెనీ ఇండియాలో అమ్మిన కార్లలో టాప్‌ ఎండ్‌ కార్ల వాటా 47 శాతమని ఆయన వివరించారు. ఫీచర్లు నచ్చితే కస్టమర్లు హై ఎండ్‌ కార్ల కొనుగోలుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఆధునిక టెక్నాలజీతో కనెక్టివిటీ ఉన్న కార్ల అమ్మకాలు ఎక్కువగా ఉంటున్నాయి. బౌతికంగా కార్లను ఎక్కవగా టచ్‌ చేయకుండానే ఆపరేట్‌ చేయగలిగే ఆధునిక ఫీచర్లు కస్టమర్లను ఎక్కువ ఆకర్షిస్తున్నాయని ఆయన తెలిపారు. ముందు ముందు మరిన్ని ఆధునిక ఫీచర్లు ఉండే కార్లు అందుబాటులో తీసుకు వచ్చేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement