Sunday, April 28, 2024

Delhi: హైదరాబాద్‌కు గ్రీన్ సిటీ అవార్డుపై ప్రచారం చేసుకోలేకపోయాం.. సీఎం కేసీఆర్ అసహనం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ‘ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్’ సంస్థ ప్రకటించిన ‘వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్స్ 2022’లో భారత్ నుంచి హైదరాబాద్ నగరం ఈ ప్రతిష్టాత్మక అవార్డు కైవసం చేసుకోవడంపై తగినంతగా ప్రచారం జరగలేదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. హరిత హారం, పట్టణాభివృద్ధి వంటి కార్యక్రమాలకు అంతర్జాతీయ స్థాయిలో దక్కిన గుర్తింపుగా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డట్టు తెలిసింది.

దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, రుణాలు, ప్రాజెక్టులు తదితర అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, పట్టణ పరిపాలన, అభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, సమాచార పౌర సంబంధాల శాఖకు చెందిన ఉన్నతాధికారి రాజమౌళిని తక్షణమే ఢిల్లీ బయల్దేరి రావాల్సిందిగా సీఎం ఆదేశించినట్టు తెలిసింది. ఈ క్రమంలో ప్రత్యేక విమానంలో అధికారులు ఢిల్లీ చేరుకున్నారు.

ఇదిలా ఉంటే సోమవారం ఉదయం నీటిపారుదల శాఖ అంశాలపై ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ సహా ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఇందుకోసం అధికారులు ఆదివారం సాయంత్రానికి ఢిల్లీ చేరుకున్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మంగళవారం కీలక ఆదేశాలు జారీచేయనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement