Thursday, April 25, 2024

మేము రాష్ట్రపతికి వ్యతిరేకం కాదు.. రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరణపై బీఆర్‌ఎస్ నేతల వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తాము వ్యతిరేకం కాదని, రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించి ప్రజాస్వామ్యయుతంగా తమ నిరసన తెలిపామని బీఆర్‌ఎస్ నేతలు వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఆ పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు న్యూఢిల్లీలోని విజయ్ చౌక్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం ఎనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమీ లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో సామాజిక, గిరిజన, మహిళ అంశాలకు ప్రాధాన్యమిస్తూ మాట్లాడినా, కేంద్ర ప్రభుత్వ పాలనలో ఎక్కడా అవి కనిపించట్లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రపతి ప్రసంగంలో ఎక్కడా నిరుద్యోగం, విద్య, ఆరోగ్యం ప్రస్తావనే లేదని కేకే పెదవి విరిచారు. వాటన్నిటిపై కేంద్రం దృష్టి పెట్టాలని సూచించారు.

ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో గవర్నర్ వ్యవహార శైలి కారణంగా బడ్జెట్ ఆమోదం కోసం కోర్టుల దాకా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవహారంతో ఆప్ ప్రభుత్వం పడుతున్న ఇబ్బందులను అందరూ గమనిస్తున్నారని కేకే చెప్పుకొచ్చారు. కేరళ, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో గవర్నర్ల తీరు కారణంగా తలెత్తుతున్న పరిణామాలను చూస్తున్నామని ఆయన అన్నారు. వీటన్నిటిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలనే రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరణ నిర్ణయం తీసుకున్నామని కేశవరావు వివరించారు.

- Advertisement -

అనంతరం ఖమ్మం ఎంపీ, బీఆర్‌ఎస్ లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రపతి, ఆమె ప్రసంగం మీద తమకు గౌరవం ఉందన్నారు. తాము మహిళ రిజర్వేషన్ బిల్లు గురించి అఖిలపక్షం సమావేశంలో చెప్పినా రాష్ట్రపతి ప్రసంగంలో ఆ ఊసే లేదని ఆయన వాపోయారు. రాష్ట్రపతి తన ప్రసంగంలో మూడు, నాలుగు సార్లు అంబేద్కర్‌ను తలుచుకున్నా, నూతన పార్లమెంట్ భవన్‌కు అంబేద్కర్ పేరు పెట్టాలన్న తమ డిమాండ్ ప్రస్తావన మాత్రం అందులో లేదని విమర్శించారు. రైతు సమస్యలు, రైతు బంధు, కనీస మద్దతు ధర ఊసే లేకపోవడం అన్యాయమని నామా అన్నారు. రైతుల మీద కేసులు వెనక్కి తీసుకోని కేంద్రానికి నీటి పారుదల మీద మాట్లాడే హక్కు లేదని ఆయన నొక్కి చెప్పారు.

నీటి పారుదల రంగం అభివృద్ధి ఏంటో ముఖ్యమంత్రి కేసీఆర్ చూపించారని హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పథకాలు కాపీ కొట్టి అమలు చేస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వకుండా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని నామా ఆరోపించారు. కేంద్రం సహకారం లేకపోవడంతో సొంత నిధులతో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నామని వెల్లడించారు. తెలంగాణకు ఏమీ చేయని కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రతి అంశంలో ఎండగడతామని, ఎనిమిదేళ్లలో రాష్ట్రానికి ఏం చేశారో నిలదీస్తామని నామా నాగేశ్వరరావు హెచ్చరించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement