Wednesday, April 24, 2024

కాలం చెల్లిన వాహనాలకు చెక్‌.. 15 ఏళ్లు పైబడితే ఇక తుక్కు కిందికే, ఆర్టీసీలో తుక్కుగా మారనున్న 1200 బస్సులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కాలం చెల్లిన వాహనాలు ఇకపై తుక్కు(స్క్రాప్‌)గా మారనున్నాయి. 15 ఏళ్లకు పైగా రోడ్లపై తిరుగుతున్న అన్ని రకాల వాహనాలను నిషేధిస్తూ కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఏప్రిల్‌ 1 నుంచి ఈ వాహనాలన్నీ కనుమరుగు కానున్నాయి. రాష్ట్ర కార్పొరేషన్లు, రవాణా శాఖ బస్సులు, ఆర్టీసీ, ఇతర వాహనాలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. పర్యావరణానికి హాని కలిగిస్తున్న కారణంగా పాత వాహనాలను తక్కుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త వాహన పాలసీకి శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వ విధానాన్ని అన్ని రాష్ట్రాలు పాటించడంతో పాటు ప్రతీ రాష్ట్ర్రంలోనూ వెహికిల్‌ స్క్రాపేజి పాలసీని రూపొందించి అమలు చేయాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు.

కాగా, రవాణా శాఖ అధికారుల అంచనా ప్రకారం 15 ఏళ్లకు పైగా రోడ్లపై తిరుగుతున్న అన్ని రకాల వాహనాలు 25 లక్షలకుపైగా ఉన్నాయి. వీటిలో ఎక్కువగా ప్రైవేటు వాహనాలే ఉన్నాయి. 15 ఏళ్లకు పైగా రోడ్లపై తిరుగుతున్న వాహనాల యజమానులు ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించరనీ, సరిగా నడిపించలేని పరిస్థితుల్లో అలాగే వదిలేయడంతో వాటిని గుర్తించడం కష్టంగా మారుతున్నదని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇక ద్విచక్ర వాహనాల విషయానికి వస్తే..లూనా, చేతక్‌, సుజుకి ఆర్‌ఎక్స్‌ 100 వంటి వాహనాలు రాష్ట్ర్రంలో లక్షల సంఖ్యలోనే ఉంటాయనీ, వీటిని గుర్తించి స్క్రాప్‌ కిందకు మార్చడం కష్టమని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇందుకు భిన్నంగా కమర్షియల్‌ వాహనాలు తప్పనిసరిగా రోడ్ల మీదకు రావాల్సి ఉంటుందనీ, వీటి ఛాసిస్‌ నంబరు ఆధారంగా ఆ వాహనం రోడ్డు మీదికి వచ్చి ఎన్ని ఏళ్లయింది ? ఎన్ని కిలోమీటర్లు తిరిగింది ? వంటి అంశాల ప్రాతిపదికన గుర్తించి సీజ్‌ చేయడానికి అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.

- Advertisement -

ఇదిలా ఉండగా, టీఎస్‌ ఆర్టీసీలో 1200 బస్సులను తుక్కుగా మార్చేందుకు ఆ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ బస్సులు గత 15 ఏళ్లుగా 17 లక్షల కిలోమీటర్లకు పైగా రోడ్లపై తిరగడంతో తుక్కుగా మార్చేందుకు నిర్ణయించారు. ఈ బస్సులకు ఫిట్‌నెస్‌ సరిగా లేకపోవడంతో రోడ్డు ప్రమాదాలకు సైతం కారణమవుతున్నాయి. ఆర్టీసీలో 2015 నుంచి 4500 బస్సులను తుక్కుగా మార్చగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త పాలసీలో భాగంగా మరో 1200 బస్సులు తుక్కుగా మారనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement