Monday, April 29, 2024

ఉక్రెయిన్‌పై ముప్పేట దాడి, కీవ్‌ ఉక్కిరి బిక్కిరి

ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడులు కొనసాగిస్తూనే ఉంది. అంతర్జాతీయ న్యాయ స్థానం ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ.. పుతిన్‌ సేన ముప్పేట దాడి కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్మీ క్యాంపులను లక్ష్యంగా చేసుకున్న రష్యా ఆర్మీ.. ఇప్పుడు ఇళ్లు, ఆస్పత్రులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నది. ఖార్కివ్‌లో స్కూల్‌, కమ్యూనిటీ సెంటర్‌పై చేసిన తాజా దాడిలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరియుపోల్‌లో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. రష్యా దాడులతో హృదయ విదారక పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాగేందుకు మంచినీరు, తినేందుకు తిండి లేని పరిస్థితి నెలకొంది. కరెంట్‌ సరఫరా నిలిచిపోవడంతో అంధకారంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

జెలెన్‌ స్కీ వీడియో విడుదల
రష్యా చర్యలతో తమ దేశం ఎంతగా ధ్వంసం అయ్యిందో తెలియజేస్తూ.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ ఓ వీడియోను విడుదల చేశారు. దాడులకు ముందు ఉక్రెయిన్‌ ఎలా ఉందో తెలుపుతూ.. ఆయన భావోద్వేగానికి గురయ్యారు. యుద్ధంతో మసకబారిన తమ దేశ పరిస్థితులపై చేసిన వీడియోను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. అక్కడి ప్రస్తుత భయానక పరిస్థితులను ప్రపంచానికి తెలిపేందుకు ఆయన ఈ ప్రయత్నం చేశారు. రష్యా బాంబు దాడులతో కాలి బూడిదైన భవనాలు, మరియుపోల్‌ ప్రసూతి ఆస్పత్రివద్ద రోగుల ఆర్తనాదాలు, తల్లిదండ్రులను విడిచి పక్క దేశాలకు వలస వెళ్తున్న చిన్నారుల పరిస్థితి, దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సామూహిక ఖననాల వంటి హృదయ విదారక దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. రష్యా తమ దేశంలో చేస్తున్నది మారణహోమమే అనే విధంగా వీడియోలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement