Saturday, May 18, 2024

Delhi | ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఓటర్ల జాబితా సవరించాల్సిందే : తెలంగాణ బీజేపీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టిన నేపథ్యంలో రాష్ట్ర ఓటర్ల జాబితాలో అవకతకవలు చోటుచేసుకున్నాయంటూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణ నేతల బృందం ఫిర్యాదు చేసింది. మర్రి శశిధర్ రెడ్డి నేతృత్వంలో బీజేపీ నేతలు మహేశ్వర్ రెడ్డి, జీహెచ్ఎంసీ కార్పొరేటర్ సరళ, భరధ్వాజ్‌తో కూడిన బృందం బుధవారం మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసింది. అనంతరం కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.

తొలుత మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ ఒత్తిడితో ఓటర్ల జాబితా నుంచి అర్హుల ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. అదే సమయంలో పట్టణ ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీల్లో పూర్తిస్థాయిలో ఓట్లు నమోదు చేయడం లేదని నిందించారు. 43 అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 77 లక్షల మంది అటు సొంతూళ్లలో ఓటు లేకుండా, ఇటు ఉన్న చోట ఓటు నమోదు కాకుండా.. మొత్తంగా ఓటు హక్కే లేకుండా మిగిలిపోయారని శశిధర్ రెడ్డి వెల్లడించారు.

ఓటర్ల జాబితా అవకతవకలను గుర్తించి సరిదిద్దడం కోసం కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఆఫీసర్‌ను నియమించాలని, కఠినంగా వ్యవహరించాలని కోరినట్టు తెలిపారు. బూత్ లెవెల్ ఆఫీసర్ (బీఎల్వో)లు ప్రతి ఇంటినీ సందర్శించి ఓటర్ల జాబితాలో లేనివారి పేర్లను నమోదు చేయాలని సూచించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయానికి దాదాపు 20 లక్షల మంది ఓటు హక్కు లేకుండా మిగిలిపోయారని, ఈసారి అలా జరగడానికి వీల్లేదని అన్నారు. సెప్టెంబర్ 19 వరకు ఓటర్ల జాబితాకు గడువు ఉందని, ఎవరి పేరైతే జాబితాలో లేదో వారు ఈలోగా ఫాం-6 తీసుకుని వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.  

- Advertisement -

ఒకే ఇంటి నెంబర్‌పై అనేక ఓట్లు

తెలంగాణలో పెద్దఎత్తున ఓట్ల తొలగింపు జరుగుతోందని నిర్మల్ బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఒకే ఇంటి నంబర్ పై అనేక ఓట్లు నమోదై ఉన్నాయని తెలిపారు. కొత్త ఓట్లను నమోదు చేసి ఎన్నికల సంఘాన్ని తప్పుదోవపట్టిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పూర్తి ఆధారాలతో ఈసీకి లేఖ అందజేశామని తెలిపారు. పట్టణ ప్రాంత నియోజక వర్గాలను లక్ష్యంగా చేసుకుని ఓట్లు తొలగిస్తున్నారని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement