Friday, May 17, 2024

50 శాతం ఆదాయం చైనాకు తరలించిన వివో.. పన్నులు ఎగ్గొట్టే ఎత్తుగడ

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ వివో భారీ ఎత్తున ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ కీలక విషయాన్ని గుర్తించింది. వివో తన మొత్తం ఆదాయంలో దాదాపు 50 శాతం, అంటే 62,476 కోట్ల రూపాయలను చైనాకు అక్రమంగా తరలించిందని, తద్వారా పన్నులు ఎగ్గొట్టిందని ఈడీ దర్యాప్తు బృందం పసిగట్టింది. ఈ విషయాన్ని గురువారం ఈడీ ప్రకటించింది. భారత్‌లో ఏర్పాటు చేసిన తమ శాఖల్లో నష్టాలు చూపుతూ ఈ మొత్తాన్ని తరలించి భారత్‌లో పన్నులు చెల్లించకుండా తప్పించుకుందని పేర్కొంది. కాగా ఇప్పటివరకు ఆ సంస్థకు చెందిన 119 బ్యాంకు అకౌంట్లను బ్లాక్‌ చేసిన ఈడీ 465 కోట్ల మొత్తాన్ని స్తంభింపచేసింది.

వివో మొబైల్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సహా 23 అనుబంధ సంస్థలపై ఈడీ ఇటీవల కాలంలో దాడులు చేసింది. వివో మాజీ డైరక్టర్‌ బిన్‌ లూ 2018లో భారత్‌ను విడిచిపెట్టిన నేపథ్యంలో వివో కార్యకలాపాలపై ఈడీ దృష్టి సారించింది.ఫోర్జరీ డాక్యుమెంట్లతో కార్యాలయాలను ఏర్పాటు చేసినట్లు వివో రికార్డుల్లో చూపి ఆర్థిక అవకతవకలకు పాల్పడిందని తేల్చింది. వివోకు చెందిన చైనీయులతో సహా ఉద్యోగులు దర్యాప్తునకు సహకరించడం లేదని ఈడీ ఆరోపించింది. చైనాకు చెందిన సంస్థల కార్యకలాపాలపై లోతుగా దృష్టి సారించిన కేంద్రప్రభుత్వం వివోలో అక్రమాలపై కొరడా ఝళిపించింది. స్మార్ట్‌ఫోన్‌ రంగంలో వివో ప్రత్యర్థి షియోమి ఇండియాపైనా ఈడీ దాడాలు చేసింది. అప్పట్లో 5551 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను సీజ్‌ చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement