Sunday, May 5, 2024

పీవీకి భారతరత్న ఇవ్వాలి.. ఇండియా గేట్ వద్ద జాతీయ పతాకంతో తెలంగాణవాసి ప్రదర్శన..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : మాజీ ప్రధానమంత్రి, మహామేధావి పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని, హన్మకొండ జిల్లాకు పీవీ జిల్లాగా నామకరణం చేయాలని డిమాండ్ చేస్తూ ఓ తెలంగాణవాసి త్రివర్ణపతాకంతో దేశ రాజధానిలో ప్రదర్శన నిర్వహించాడు. సామాజిక కార్యకర్త, పీవీ నరసింహారావు జయంతి ఉత్సవ కమిటీ ఛైర్మన్ పిడిశెట్టి రాజు గురువారం న్యూఢిల్లీలోని ఇండియాగేట్ వద్ద జాతీయ పతాకం పట్టుకుని ప్రదర్శన చేశారు. అనంతరం తెలంగాణ భవన్‌లో పీవీ చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పిడిశెట్టి రాజు మాట్లాడుతూ… పీవీ నరసింహారావుకు భారత అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇవ్వాలని, హన్మకొండ జిల్లాను పీవీ జిల్లాగా నామకరణం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ నాయకత్వంలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిందని గుర్తు చేశారు. అయినా కేంద్రం స్పందించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలవ్యాప్తంగా సైకిల్ యాత్ర చేశామని రాజు చెప్పుకొచ్చారు. బహుభాషా కోవిదుడు, ఆర్థిక సంస్కరణల పితామహుడు అయిన పీవీ కరీంనగర్ జిల్లా (పాత) బీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో జన్మించి మంథని నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అనేక శాఖల్లో మంత్రి పదవులు చేపట్టి ప్రపంచ దేశాలకు భారతదేశ ఖ్యాతిని చాటి చెప్పిన గొప్ప మహనీయుడని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో సామాజికవేత్తలు, బాలల హక్కుల ప్రజావేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వలుస సుభాష్ చంద్రబోస్ నేత, పీవీ నరసింహారావు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement